అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయి

– ఫిరాయింపుల కేసులో సుప్రీం తీర్పుపై కేటీఆర్‌ స్పందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తున్నదని చెప్పారు.
కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. పంచ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిగ్గా అనర్హత వర్తించాలని గత ఎన్నికల సందర్భంగా చెప్పిన రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఆయన చెప్పే మాటలకు, నీతులను కట్టుబడి ఉండాలని సవాలు విసిరారు. దమ్ముంటే, నిజాయతీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపాలని రాహుల్‌గాంధీని నిలదీశారు. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నానన్నారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. రానున్న మూడు నెలల కాలంలో ఆ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు పార్టీ సిద్ధం అవుతుందని, ఈ దిశగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *