– ఒక్క కేసులోనూ ఆధారం చూపడం లేదు
– లోకేశ్‌ను కలిస్తే తప్పేంటి?
– సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 18: తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని చివరికి గుండు సూదంత ఆధారం కూడా చూపలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ధైర్యం ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం.. నేను జీవితంలో ఏనాడూ సిగరెట్ కూడా తాగలేదు అని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై ఎన్నో ఆరోపణలు చేశారు. తాను ఏం చేసినా బాజప్త్తా చేస్తా.. తాను ఏపీ మంత్రి లోకేశ్‌ను కలవలేదు.. ఒకవేళ కలిసినా తప్పేంటి? నారా లోకేశ్ మంచి మిత్రుడు.. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి.. ఆయన పక్క రాష్ట్రం మంత్రి.. నాకు తమ్ముడి లాంటి వాడు అని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రేవంత్‌రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యం అని విమర్శించారు. నా విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు, ఓ సారి కార్ రేసింగ్ అంటున్నారు. రేవంత్‌రెడ్డి వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లాభం చేకూరలేదన్నారు. గాసిప్‌ల మాయలో పడి ఆరు గ్యారంటీలను మర్చిపోదామా అని ప్రజలను ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. దిల్లీ భేటీ అజెండాలో బనకచర్ల అంశమే లేదని కేటీఆర్ అన్నారు. దిల్లీ కేంద్రంగా రాష్ట్రానికి మరోసారి ద్రోహం చేశారు.. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నారు.. 420 హామీల విషయంలో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్ ఫుట్‌బాల్ ఆడటం ఖాయమన్నారు.
మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్న రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతానన్నారు. రేవంత్ ప్రెస్‌మీట్‌కు యువత దూరంగా ఉండాలని సూచించారు. రేవంత్ పిరికి సన్నాసి.. చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని… చిట్‌చాట్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.





