కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీసు స్టేషన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గురువారం ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను అందజేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం నకిరేకల్ గురుకుల పాఠశాలలో లీక్ అయిందని పేర్కొంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంపై అందిన ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌పై పోలీసు కేసు నమోదైంది. ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ సోషల్ మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ట్వీట్ చేశారని చెప్పారు. అది తప్పుడు వార్త అనే విషయం కేటీఆర్‌కు తెలియదన్నారు. కేవలం రాజకీయ కక్షసాధింపుతో పోలీసులకు ఫిర్యాదులు చేయించారని, తప్పుడు కేసులను కొట్టేయాలని కోరారు. ఒకే నేరానికి సంబంధించి బహుళ ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి వీల్లేదన్నారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.



