పెండింగ్‌లో 95శాతం హామీలు!

– ఈ సారి బడ్జెట్‌లో వీటికి కేటాయింపులు జరపాలి
– ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం అమలు కాలేదు
– రైతుబంధు పెంచనందుకు క్షమాపణలు చెప్పాలి
– యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి
– ఆరు గ్యారంటీలు అమలు ఏంచేశారు?
– వృద్ధులకు రూ.4వేల పింఛను మాటేంటి?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తవుతున్నా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్‌లోనే ఉన్న నేపథ్యంలో ఈసారైనా బడ్జెట్‌లో వాటికి కేటాయింపులు చేయకపోతే తెలంగాణ సమాజం ఓపిక పట్టబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీýకు సంబంధించి మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయింపులు జరపాలని, డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నిధులు కేటాయించాలని కోరారు. ఆయా వర్గాలకు రెండేళ్లుగా ఎగ్గొట్టిన హామీలకు సంబంధించిన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించాలన్నారు. నిధులు కేటాయించకుంటే ప్రజల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. వృద్ధులు, వితంతువులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను రూ.4వేలకు పెంచడానికి ఎన్ని నిధులు కావాలో లెక్కగట్టి ప్రతి పైసాను ఈసారి బడ్జెట్‌లో కేటాయించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి కింద నెలకు రూ.2500లు అందజేస్తామని హామీ ఇచ్చి 25 నాలుగు గడిచిపోయినా ఇప్పటికీ ఒక్కరికీ ఒక్క పైసా దక్కలేదని గుర్తుచేశారు. అందుకే ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఈ గ్యారెంటీ అమలుకు అడుగులు పడకపోతే ఆడబిడ్డలు ఊరుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాగే రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని మా{ ఇచ్చి మోసం చేసినందుకు ముందు క్షమాపణలు చెప్పి ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించాలని అన్నదాతల పక్షాన కోరారు. ఇప్పటికే మూడుసార్లు పెండింగ్‌లో పెట్టిన రైతుబంధు పాత బకాయిలను కూడా చెల్లించాలన్నారు. అలాగే కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాల్లో నిధులు జమ చేయాలని కోరారు.

నిరుద్యోగులకిచ్చిన హామీ కూడా పెండింగ్‌లోనే 

కేవలం రైతులు, మహిళలకే కాదు, నిరుద్యోగులకిచ్చిన ప్రతి హామీ కూడా రెండేళ్ల నుంచి పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాల భర్తీతోపాటు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలన్నారు. అలాగే ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న ఆర్థిక సహాయం అందజేయడానికి 2026-2027 బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం రానున్న బడ్జెట్‌లో కూడా అభయహస్తంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలకు నిధుల కేటాయింపు చేస్తున్నట్లు కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరిట మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి, నిట్టనిలువునా మోసగించడానికే సన్నాహాలు చేస్తున్నట్లు కనబడుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, మొదటి కేబినెట్‌లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా మీరు హామీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయినట్టు నటించినా ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నానన్నారు. దిల్లీ నేతల సమక్షంలో మ్యానిఫెస్టోను విడుదల చేయడమేకాక చివరికి ఇంటింటికీ గ్యారెంటీ కార్డులను కూడా పంపిణీ చేసి ఇన్నేళ్లపాటు దగా చేయడాన్ని తెలంగాణ సమాజం సహించదన్నారు. మీ పాపాల ప్రక్షాళన జరగాలంటే ఈసారి బడ్జెట్‌లోనైనా మేనిఫెస్టోలోని హామీల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ప్రభుత్వం రూ.62,500 బాకీ పడింది. అవ్వ తాతలకు, బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేలు పెన్షన్ చేస్తామన్నారు. కానీ ఈ 25 నెలల్లో ఒక్కొక్కరికి రూ.లక్ష వరకూ బాకీ పడ్డారు. దివ్యాంగులను దగాచేశారు. కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కింద ఈ రెండేళ్లలో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల తల్లులందరికీ తులం బంగారం బాకీ పడ్డారు. యువ వికాసం కింద రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వనే లేదు. విద్యార్థినులకు స్కూటీలు రానేలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా వేల కోట్లు బాకీ పేరుకుపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే 42 పేజీల అభయహస్తం మేనిఫెస్టోలోని 420 హామీల్లో 5 శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.

ఎన్నికలు ముగిసి 10 రోజులైనా రైతుబంధు జమ కాలేదు

మున్సిపల్ ఎన్నికలకు ముందు మీరు ఓ సభలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తామని వాగ్దానం చేశారు.. మున్సిపల్ ఎన్నికలు ముగిసి 10 రోజులు కాస్తున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కాలేదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని మాట మార్చి ఐదేళ్లలో భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం నిరుద్యోగ యువత గొంతుకోయడమేనన్నారు. వారికి ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న వాగ్దానాన్ని గంగలో కలిపి ఇప్పటివరకు నయా పైసా కూడా చెల్లించకుండా మోసగించారన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని, వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామంటూ ఇచ్చిన హామీల అమలు అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఆ బకాయిలను కూడా ఈ బడ్జెట్‌లో కేటాయించాలని సకల జనుల తరపున డిమాండ్ చేస్తున్నానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *