– ఐదు రోజుల్లో స్పందించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24ః తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశ పూర్వకంగా, నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు సంజయ్, అరవింద్ లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చేసిన ఆరోపణలను బండి సంజయ్‌కు పంపిన నోటీసులో కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ మళ్ళీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమన్నారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసులో వివరించారు. ఈ ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేటీఆర్‌కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




