– హతుడి కుటుంబానికి రూ.5లక్షల సాయం అందజేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కేవలం పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణ మాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం.. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు. మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నేతలు దిక్కుమాలిన రాజకీయాలు మాని ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే తాము కూడా తిరగబడక తప్పదని, అదే జరిగితే రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. ఇలాంటి హింసాత్మక సంస్కృతి గతంలో లేదని, ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు. మల్లయ్య చనిపోయిన వెంటనే రావాలనుకున్నా ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతోనే ఆగానని కేటీఆర్ తెలిపారు. తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని కేటీఆర్ మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ఎదురుచూస్తున్నార\న్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్య, నేతలు భూపాల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు, దయాకర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




