ప్రాజెక్టులపై సోయి లేని ప్రభుత్వం

  • మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాదఘంటికలు
    – నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు
    – నేడు సింగూరు డ్యామ్‌కు మోగిన డేంజర్‌ బెల్స్‌
    – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం
  • హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పులేదనట్టు పోజులు కొట్టే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కాళేశ్వరంపై మాత్రం బురదజల్లడం వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రాజెక్టులు కట్టాక మరమ్మతులు వస్తుంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లను బూచిగా చూపించి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్‌ గేట్‌ రోప్‌ తెగిపోవడంతోపాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్‌లను అలాగే గాలికొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయిలేదన్నారు. ఇవాళ సింగూరు డ్యామ్‌కు కూడా డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయని, ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జూరాలకు, మంజీరాకు, సింగూరుకు ఒక న్యాయం.. మేడిగడ్డ బ్యారేజీకి మాత్రం మరో న్యాయం అంటే నాలుగు కోట్ల ప్రజలు ఊరుకోరన్నారు. అన్ని ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిందేనని, ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చే ఏ ప్రాజెక్టునైనా కంటికి రెప్పలా కాపాడాల్సిందేనని కేటీఆర్‌ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు ప్రవీణ్‌ కుమార్‌ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్బంధించడం రేవంత్‌ ప్రభుత్వ గూండాగిరికి నిదర్శనమన్నారు. పోడు రైతులను వేధించడం ఆపి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని, కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉందని కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *