తెలంగాణ ప్ర‌తిష్ట‌ను పెంచాను

-త‌ల‌దించుకునే ప‌నేం చేయ‌లేదు
-అవినీతి జ‌ర‌గ‌ని కేసులో ఏసీబీని రంగంలోకి దించ‌డ‌మేంటి?
-అరెస్ట్ చేయాల‌నుకుంటే చేసుకోవ‌చ్చు
-కాళేశ్వ‌రం గొప్ప‌త‌నాన్ని రాష్ట్రమంత‌టా చాటాలి
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌

తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని తాను ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేద‌ని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు అన్నారు. నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా ఈ రేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి పారిపోయిండని విమర్శించారు. ఏసీబీ విచారణ తరువాత తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తానంటే రావడానికి రేవంత్ రెడ్డికి ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.

మొదటి సంవత్సరం ఫార్ములా రేసు విజయవంతం కావడంతో రెండవ సంవత్సరం కూడా ఎలాగైనా హైదరాబాద్ లోనే నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని అందులో భాగంగానే, నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అసలు అవినీతి జ‌ర‌గ‌ని కేసులో ఏసీబీని ఇన్వాల్వ్ చేయడాన్ని తన 26 సంవత్సరాల కెరీర్ లో చూడనే లేదని మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.

చిట్టినాయుడు రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే పొద్దుటి నుంచి అటుతిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు అడిగారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్ చెయ్యాలని ఒత్తిడి ఉంటే బేషుగ్గా చేసుకోవచ్చని అధికారులకు చెప్పానన్న కేటీఆర్, అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్దమన్నారు. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేవారు ఎవరూ బీఆర్ఎస్ లో లేరన్నారు . రూ.50 లక్షల డబ్బుల బ్యాగుతో లుచ్చా పని చేసి అడ్డంగా దొరికి నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి, తమను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలన్న ఆలోచనతో ఉన్నాడని కేటీఆర్ తెలిపారు.

అందులో భాగంగానే తెలంగాణ సాధించిన కేసీఆర్ ను, మాజీ మంత్రి హరీశ్ రావును కాళేశ్వరం కమిషన్ ముందుకు,తనను ఏసీబీ విచారణకు పిలుస్తున్నార‌ని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారిందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కేడర్ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పెడితే ఒక 15 రోజులు తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అన‌లేద‌న్నారు.

2019 జూన్ 21 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడించడం మీద బీఆర్ఎస్ నాయకులు దృష్టి పెట్టాలన్నారు.పొద్దుటి నుంచి ఓపికగా తనకోసం ఎదురు చూసినఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,పార్టీ కార్యకర్తలు,నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ …రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టాడ‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేద‌న్నారు మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాల‌న్నారు.కేటీఆర్  ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ ఫార్ములా రేసింగ్ కోసం పోటీపడుతుంటే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్‌కు ఫార్ములా ఈ రేసును తీసుకువచ్చార‌న్నారు.

రేవంత్ రెడ్డి మాత్రం ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించమని తేల్చి చెబితే తెలంగాణలో నిర్వహించి ఈ దేశ పరువు, రాష్ట్ర పరువు తీశారంటూ విమ‌ర్శించారు. అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్‌ను తెచ్చి రాష్ట్ర గౌరవం పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వ‌మేన‌న్నారు. ఎవరూ ముందుకు రాని అందాల పోటీలు నిర్వహించి పరువు తీసింది రేవంత్ రెడ్డి అని విమ‌ర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి కేటీఆర్ పై తప్పుడు కేసులు పెట్టి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  రేవంత్ రెడ్డి పాలనలో తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కమీషన్లను ఎత్తిచూపితే కేసులు, లఘుచర్ల రైతులకు బేడీలేస్తే కేసులు, ప్రశ్నిస్తే కేసులు పెట్టార‌న్నారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ భ‌య‌ప‌డ‌డ‌ని, ఆయ‌న ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *