జాక్‌పాట్‌లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు
జిల్లాలో నీళ్ల మంత్రులు ఉన్నా శూన్యం
కేసీఆర్ లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే లేదు
మాజీ మంత్రి కేటీఆర్
రేవంత్ రెడ్డి జాక్‌పాట్‌లో రాష్ట్రానికి సీఎం అయ్యారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లి ఉత్సవాల ఏర్పాట్లపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కేటీఆర్‌కు జిల్లా బీఆర్‌ఎస్ శ్రేణులు జనగామ ఎక్స్ రోడ్డు వద్ద ఘనస్వాగతం పలికారు. పట్టణంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వం ఉందని చెప్పింది కేసీఆర్ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ధైర్యంగా పార్టీ పెట్టిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని అన్నారు. శూన్యం నుంచి సనామీని సృష్టించి తెలంగాణ సాధించిన ఘనుడు కేసీఆర్ ఒక్కరేనని అన్నారు.
కేసీఆర్ లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే లేదని, చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణను సాధించి, దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఉద్యమాలు, ప్రతిపక్ష పాత్ర కొత్తేమి కాదనే విషయాన్ని అధికార పార్టీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఓటమి తర్వాత మళ్లీ ఫీనిక్స్ పక్షిలా బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ బలపడిందని తెలిపారు. నిన్న మొన్న వొచ్చిన రేవంత్ రెడ్డి జాక్‌పాట్ సీఎం అని, దిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోడమే ఆయన పనిగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైపల్యాల పై రేవంత్ రెడ్డిని చీల్చి చెండాతున్నామని, ప్రతి తెలంగాణ బిడ్డ గుండె ధైర్యం గులాబీ జెండా అన్నారు. మన పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ ప్రస్థానంలోకి అడుగు పెట్టబోతుందని, ఇవ్వాళ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అనివార్యంగా మారిందన్నారు.

తెలంగాణ బాగు కొరకు అధికారం కావాలని కోరుకుంటున్నామని, కాంగ్రెస్ రాకాసులను తరలికొట్టాలంటే అధికారం మనం సాధించాలని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ సూర్యాపేటకు ఇచ్చారని, ఎస్సారెస్పి కింద కళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేశామని, జిల్లా మంత్రి ఉత్తమ్ ఉన్న వేస్ట్ అని, అనతి వల్ల ఏ కాదని, నీళ్లు ఇవ్వలేని ఉత్త మంత్రి ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, సాగర్ కింద కూడా నీళ్లు ఇవ్వడం లేదని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు. మూడు మెడికల్ కళాశాలు, అద్భుతమైన అభివృద్ధి చేశారని అన్నారు.
జగదీష్ రెడ్డి ఏం అనకున్నా అకారణంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని, అసెంబ్లీని గాంధీ భవన్‌తో పోల్చిన వ్యక్తి పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. తెలంగాణ కోసం పేగులు తెగేదాక కొట్లాడింది బీఆర్‌ఎస్ పార్టీ అని, త్వరలోనే సభ్యత్వ నమోదు కూడా నమోదు చేస్తామని, కార్యకర్తలకు శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్‌రావు, నోముల భగత్, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, జడ్పి మాజీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, మాజీ పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్, గండూరి ప్రకాష్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే