సిరీస్‌ భూములు రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చిందెవ‌రో?

– అయ్య ముఖ్యమంత్రిగా, కొడుకు మంత్రిగా వేల ఎకరాలు ధారాదత్తం
– హిల్ట్‌ పాలసీపై కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: హిల్ట్‌ పాలసీపై బీఆర్‌ఎస్‌ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హిల్ట్‌ పాలసీపై బీఆర్‌ఎస్‌ ఆరోపణల గురించి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. హిల్ట్‌ పాలసీలో రెండు అంశాలు బీఆర్‌ఎస్‌ పాలనలో వచ్చినవేనంటూ ఆ ఫైల్‌పై మంత్రిగా కేటీఆర్‌ సంతకం చేసిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపోలిస్‌ ప్లాట్లు వేలం వేశారు, హిల్ట్‌ను దోపిడీ పాలసీ అంటున్న కేటీఆర్‌కు ఇవి గుర్తులేవా? ఓఆర్‌ఆర్‌ నిర్వహణను కూడా వేలం వేశారు. అయ్య ముఖ్యమంత్రిగా, కొడుకు పరిశ్రమల శాఖ మంత్రిగా కావలసిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను మార్పిడి చేశారు. ప్రభుత్వ భూములు వేలం వేశారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది ఎకరాలు వేలం వేశారు. ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్‌బీ నగర్‌లోని దాదాపు 40 ఎకరాల స్ధలాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇస్తే ఆ ఫ్యాక్టరీతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన కూడా చేశారు. ఈ కంపెనీని రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చింది బీఆర్‌ఎస్‌ కాదా అని నిలదీశారు. ఈ ఫైలుపై తండ్రీకొడుకులు సంతకాలు చేయలేదా అని నిలదీశారు. ఏ పాలసీతో ఈ కన్వర్షన్‌ చేశారని అడిగారు. ఐడీపీఎల్‌లో కూడా ఇదే విధంగా చేశారన్నారు. కేటీఆర్‌ కడుపునిండా విషమే ఉంది. విషం కక్కడానికి కూడా ఒక హద్దు, అదుపు, పద్దతి ఉంటుంది. హిల్ట్‌ పాలసీపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లది ఒకే డ్రామా.. స్క్రిప్ట్‌ రాసేది ఒకరు.. డెలివరీ చేసేది మరొకరు అని ఎద్దేవా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *