భయపడకండి…అండ‌గా వుంటా

– తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు
– నల్ల బాలు (శశిధర్ గౌడ్) కుటుంబ సభ్యులకు భరోసా
–  కల్వకుంట్ల తారక రామారావు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 24: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని, ప్రతి ఒక్కరికి తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆరోపణలపై అరెస్టై బెయిల్ పై తిరిగి వచ్చిన నల్ల బాలు (శశిధర్ గౌడ్) ను సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పోచారం గ్రామంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా శశిధర్ గౌడ్ ఇంటికి కేటీఆర్ చేరుకుని ఆయనతో పాటు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. నల్ల బాలు కుటుంబ సభ్యులతో కలసి కేటీఆర్ కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకను జరుపుకున్నారు. శశిధర్ గౌడ్ పిల్లలకు బహుమతులు అందించారు. వారితో కలిసి భోజనం చేశారు. అక్రమ కేసులు మనల్ని ఏం చేయలేవని, ఎవ్వరు భయపడవద్దని ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై కార్యకర్తలు ఇంకా గట్టిగా నిలదీయాలని సూచించారు. శశిధర్ గౌడ్ కుటుంబానికి నేను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శశిధర్ గౌడ్ కానీ ఇంట్లో భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారని, మాజీ మంత్రి కేటీఆర్ ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి భోజనం చేయడంతో ఎంతో భరోసానిచ్చినట్లు అయిందని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకున్నారు.

రూ.1,11,000 విరాళం అందజేత

పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని మాదారం గ్రామంలో చేపట్టబోయే శ్రీ పంచముఖి హనుమాన్ విగ్రహానికి పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి రూ.ఒక లక్ష 11 వేలు విరాళం అందజేశారు. ఈ చెక్కును మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆలయ కమిటీ వారికి అందజేశారు.

తోపులాటలో అపశృతి

కేటీఆర్ వస్తున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పోచారంకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా జై తెలంగాణ, కేటీఆర్ సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ దూసుకు వచ్చారు. దీంతో కేటీఆర్ జన్మదిన సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకు తోపులాటలో కింద పడి పోయింది. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేటీఆర్ తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, కార్పొరేటర్లు వి.సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్, మాజీ జడ్పీటీసీలు శ్రీకాంత్ గౌడ్, బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *