– ఓసారి రెమో.. మరోసారి రామ్‌లా కనిపిస్తాడు
– కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గొప్పలు
– స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాల్సిందే
– లింగంపేట ఆత్మగర్జన సభలో కేటీఆర్
కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 25: సీఎం రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు నిజమైన ముఖాన్ని చూపకుండా నటిస్తున్నాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిరచాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులు ఇంకా అందలేదు.. కానీ మూటలు దిల్లీకి వెళ్తున్నాయి.. రాహుల్ గాంధీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయ్ అంటూ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మగర్జన సభలో కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు కాగితాలు ఇచ్చి తానే ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. ఇది ప్రజలను మోసగించడమేనన్నారు. ప్రభుత్వాన్ని నడిపించే వాడు నిజంగా బాధ్యత గల నాయకుడు అయితే సంపద, ఆదాయం పుడుతుందన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు విషం పెడుతున్నారు.. ఇప్పటివరకు వందమంది విద్యార్థులు చనిపోయారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తులతో లక్షలాదిమందిని సమీకరించి రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని బోధించి ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్లపాటు కేసీఆర్ కొట్లాడితే తెలంగాణ వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఆ మహనీయుడిని గౌరవించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నామని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమున్నతంగా గౌరవించుకున్నామని తెలిపారు. అంబేద్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని కొనియాడారు. దళితుల జీవితాల్లో అద్భుతమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో దళితబంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. ఆ పథకం కింద కేసీఆర్ రూ.10 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామని చేవెళ్లలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ప్రకటించారని గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వ పనుల్లో 26శాతం ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారని, దళిత, గిరిజనులు ఇండ్లు నిర్మించుకుంటే రూ.6 లక్షలు ఇస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆరు పైసలు కూడా ఇవ్వని సిగ్గులేని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. రెండుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న కారణంగా మొన్న రైతుబంధు వేశాడని విమర్శించారు. అరకొరగా రైతుబంధు వేసి సంబరాలు చేసుకోమంటున్న దిక్కుమాలిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. కేసీఆర్ రైతులకు రూ.10టశీaఱ ఇస్తే తాము రూ.15000 ఇస్తామన్నారని.. వృద్ధులకు ఇస్తున్న రూ.2 వేల పెన్షన్‌ను రూ.4000 చేస్తామన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నాడు తాము అధికారంలోకి వస్తే ఇద్దరికి ఇస్తామన్నారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే దాన్ని చివరకు రూ.12 వేల కోట్లకు కుదించి అది కూడా సగమే చేశారని అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం, నెలకు రూ.2,500లు ఇవ్వడం లేదు.. వడ్లకు బోనస్ ఇస్తామని అన్నీ బోగస్ మాటలు చెప్పారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ అప్పులపాలు చేశారని కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ ఆపకుండా రైతుబంధు, కేసీఆర్ కిట్లు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, గురుకులాల్లో సన్న బియ్యం పెట్టారని గుర్తుచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్‌ఎస్ ను గెలిపించుకుంటేనే అహంకారంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి, ఆయన తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులకు బుద్ది వస్తుందని అన్నారు. వేములవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి తిన్న భోజనం ఖరీదు ఒక ప్లేటుకు రూ.లక్ష 35 వేలు.. అందాల పోటీల్లో ఒక్క ప్లేట్ భోజనానికి రూ.లక్ష ఖర్చు చేసిన ఈ ప్రభుత్వానికి కనీసం రూ.100తో గురుకులాల పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న సోయి లేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ గురుకులాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా పనిచేశాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెర్లు అయిన తెలంగాణను బాగు చేసుకోవాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందే అని కేటీఆర్ అన్నారు.





