– ఎరువుల కొరతపై గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వినూత్న నిరసన
– అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలి
– ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అంతకుమించి నిర్వహించినా తాము సిద్ధమేనని అన్నారు. రాష్రంలో నెలకొన్న ఎరువుల సంక్షోభంపై బీఆర్ఎస్ గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో వినూత్నంగా నిరసన చేపట్టి ఎరువుల కొరత తీర్చి రైతులను ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వ్యవసాయ, రైతు సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తామని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలంటూ ప్రభుత్వం వేసిన కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్ అని ఎద్దేవా చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామన్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను తనకు అనుకూలంగా ఉండేలా నడిపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలపైన, రాష్ట్రంలో ఎరువుల సంక్షోభం పైన మాట్లాడటం లేదన్నారు. పదేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎరువుల కొరత రాలేదు.. రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి రాలేదని ఆయన అన్నారు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులు, ఆధార్ కార్డులను లైన్లో పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, భారీ వర్షాల వల్ల ఇబ్బందుల గురించి గానీ సుదీర్ఘంగా చర్చించే అవకాశం అసెంబ్లీలో ఇవ్వాలని, వ్యవసాయ సంక్షోభంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. 600కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 75 లక్షల మంది రైతులు ఈరోజు అవస్థల్లో ఉన్నారు. రైతులకు కాంగ్రెస్ చేసిన మోసం పైన అసెంబ్లీలో చర్చ జరగాలి. ఆరు గ్యారెంటీల నుంచి 420 హామీల అమలు వైఫల్యాల దాకా అన్ని అంశాల పైన చర్చిద్దాం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు, వాటి పైనా చర్చ జరగాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ప్రజల కష్టాలు, సమస్యల పైన చర్చలకు అసెంబ్లీ వేదిక కావాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





