ఆర్థిక దుష్ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్‌

– ఈ వాద‌న త‌ప్ప‌ని తేల్చిన కాగ్‌
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29:  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై  ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రతి నెలా రూ.7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది అబద్ధం. దీనిపై త‌ప్పుడు  ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘కాగ్‌’ నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ.2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్న‌దని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నార‌న్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. రూ. 3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ.225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చంద్ జయంతిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఆటలు మనకు సహకారం, పోరాట స్ఫూర్తిని నేర్పిస్తాయన్నారు. కష్టాలను అధిగమించి మనకు స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన క్రీడాకారులను మనం గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *