ప్ర‌భుత్వ స్పంద‌న స‌రిగ్గా లేదు

– పార్టీ శ్రేణులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాలి
– మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేయండి
– ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న ప్ర‌భుత్వం
– బిహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌న చాప‌ర్లు
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 28: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేశారు.  గత ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపై దృష్టి పెట్టి  ఎన్ డీఆర్ ఎప్‌, ఎస్‌డీఆర్ ఎఫ్  విభాగాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనిచేసేవాళ్ళమ‌న్నారు. గురువారం ఆయ‌న పార్టీ శ్రేణుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ ప్ర‌భుత్వం త‌గిన రీతిలో స్పందించ‌డంలేద‌ని ఆరోపించారు.  కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. తీ వ్రమైన వరద ఉన్నచోట ఆహారం, తాగునీరు వంటి నిత్యావసరాలు అందించాల‌న్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాల‌న్నారు. కాగా అంత‌కు ముందు ఆయ‌న సిరిసిల్ల జిల్లాలోని న‌ర్మ‌ల‌లో త‌ర్వాత కామారెడ్డి ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మానేరుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తుంటే ప్రజలను అప్రమత్తం చేయకుండా వారి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింద‌ని ఆరోపించారు.మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తిరగడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం జ‌రిగింద‌ని ఆరోపించారు. వర్షాకాలం సందర్భంగా చేపట్టాల్సిన సన్నద్దతను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రాణనష్టం జరిగితే రూ.25 లక్షలు, ఎకరాకు రూ.25 వేల పంటనష్టం పరిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు కెటిఅర్ ధన్యవాదాలు తెలిపారు.   కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సత్వరంగా హెలికాప్టర్లను పంపి వారి ప్రాణాలను కాపాడారని గుర్తుచేశారు. గతంలో ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు కూడా ముగ్గురు మంత్రులు ఆ జిల్లా నుంచి ఉండి కూడా అక్కడికి హెలికాప్టర్ పంపలేక పోవడంతో అక్కడ ప్రాణ నష్టం సంభవించిందని తెలిపారు. ఇప్పుడు నర్మాల లో కూడా నేవీ హెలికాప్టర్లు వచ్చి వరదలో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాయన్నారు.  మీడియా  తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని ప్రశంసించారు. మరో నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలను ఆదుకోవాలన్నారు కేటీఆర్. కేంద్రం కూడా స్పందించి రాష్ట్రానికి సహాయం చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు తాగునీరు, ఆహారాన్ని అందిస్తున్నారని, త్వరలో పార్టీ తరపున వైద్య శిబిరాలను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం, మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని ఆయ‌న‌ పరిశీలించారు. అ తర్వతా కామరెడ్డి జిల్లాకు బయలు దేరారు. కానీ, మార్గమద్యంలో కామరెడ్డి జిల్లా మచారెడ్డి మండలం హైవేపైన ఉన్న పల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును కేటీఆర్ పరిశీలించారు.రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతంగా బ్రిడ్జి పైనుంచి ప్రవహించడంతో కామారెడ్డికి వెళ్లడం సాధ్యం కాక అక్కడి నుంచి తిరిగి సిరిసిల్లకు వెళ్లారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *