హస్తిన యాత్రల్లో అర్ధశతకం సాధించిన రేవంత్‌

– అయినా రాష్ట్రానికి నయా పైసా లాభం లేదు
– టూరిస్టు సీఎంగా మిగిలిపోతారు
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా రేవంత్‌రెడ్డి ఫ్లైట్‌ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని, రాహుల్‌ గాంధీ, నరేంద్రమోడీ, చంద్రబాబుల ముద్దుల బానిసగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిండు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. అధికారంలో వచ్చిన 20 నెలల్లో 50 సార్లు దిల్లీకి పోయిన రేవంత్‌ రెడ్డితో రాష్ట్రానికి పైసా ప్రయోజనం కలగలేదని ఎద్దేవా చేశారు, టూరిస్ట్‌ సీఎంగా దేశ చరిత్రలో మిగిలిపోతారన్నారు. పాలించే ముఖ్యమంత్రి కావాలి కానీ దిల్లీకి విహార యాత్రలు చేసే టూరిస్ట్‌ సీఎం అవసరం లేదన్నారు. తన మొదటి బాస్‌ రాహుల్‌ గాంధీకి నోట్ల కట్టల మూటలు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నారని ఆయన చెప్పారు. రెండో యజమాని మోదీకి సన్నిహితులైన వ్యాపారవేత్తలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, ఇక మన అన్నదాతల కడుపు కొట్టి తెలంగాణ జల సంపదను తన మూడో యజమాని చంద్రబాబుకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సోయి లేని రేవంత్‌ బానిస మనస్తత్వంతో త్యాగాల పునాదులపై పురుడు పోసుకున్న తెలంగాణ నిలువు దోపిడీకి గురవుతోందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీ యాత్రలతో సాధించిందేమిటో దమ్ముంటే రేవంత్‌ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించే బనకచర్లతో మన వ్యవసాయ రంగం పెను సంక్షోభంలోకి కూరుకుపోతుందని, యావత్‌ తెలంగాణ తల్లిడిల్లుతుంటే రేవంత్‌ రెడ్డి మాత్రం గురువు చంద్రబాబుకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీళ్లు రాక రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే సీఎంకు సోయి లేదన్నారు. పండిరచిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేక, పొలాల్లో చల్లడానికి యూరియా దొరక్క అన్నదాతలు అరిగోస పడుతుంటే రేవంత్‌ మాత్రం ఫోటో షూట్లు, వీడియోలు, విందు రాజకీయాలతో జల్సాలు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ వచ్చినంక తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు.. జాబ్‌ క్యాలెండర్ల జాడ లేదు.. రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా రాలేదు.. తులం బంగారం ఊసు లేదు.. రూ.4 వేల ఫించన్‌ జాడ లేదు. గురుకులాల గోడు పట్టదు.. గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు ఆగడం లేదు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *