అన్ని వర్గాల ప్రజలను ముంచిన కాంగ్రెస్

– హామీలన్నింటినీ విస్మరించి, ఉత్త‌మాట‌ల‌తో ప‌బ్బం
– కేవలం వోట్ల సమయంలోనే రైతు బంధు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌లు
సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు

సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 29 : గత 20 నెలలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, అవినీతి అరాచకాలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్‌ ఎండగట్టారు, ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  వోటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన కాంగ్రెస్, ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం‌గా, నిట్ట నిలువునా అందర్నీ ముంచింద‌ని విమ‌ర్శించారు. . రైతులకు, నిరుద్యోగులకు, వృద్ధులకు, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించి, ఉత్తమాటలతో కాలం గడుపుతోందని విమర్శించారు. వోట్ల సమయంలోనే రైతు బంధు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వ్యవసాయం బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ రావాలన్నది ఇప్పుడు రైతుల అభిప్రాయం. అధికారంలోకి వొచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర యువతను విద్యార్థులను తీవ్రంగా మోసం చేసింది. ఆడపిల్లలకు స్కూటీలు, నిరుద్యోగులకు భరోసా ఇవ్వకుండా మోసం చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరు చెప్పి మిగిలిన హామీలన్నింటినీ ఎత్తగొట్టింది’’ అంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శల దాడి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజలందరిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపం పెరిగిపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో పాటు బీసీలను కూడా మోసం చేసింది. బీసీ రిజర్వేషన్ల పేరుతో జరుగుతున్న మోసాన్ని బీసీలకు వివరించాలి అని కార్యకర్తలకు సూచించారు.  పల్లెల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘గ్రామాల్లో ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో కేసీఆర్ నాయకత్వం ప్రత్యేకంగా నిలిచింది. ఎట్లుండే సిరిసిల్ల, ఎట్లా అభివృద్ధి చెందిందో ప్రతి చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమన్వయంతో, ఐక్యంగా పనిచేస్తూ గులాబీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. సిరిసిల్లలో మనను ఓడించే నాయకుడే లేడు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కనబడడం లేదు. మెజారిటీ స్థానాల్లో గెలిచి, అధికారాన్ని తిరిగి సాధించాలి. కష్టకాలంలో అండగా నిలిచిన  మిమ్మల్ని నాయకత్వం ఎప్పటికీ మరిచిపోదు,’’ అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యేగా అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రమంతా రామన్న జపమే..
రాష్ట్ర‌మంతా రామ‌న్న జ‌ప‌మే చేస్తోంద‌ని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.  కేటీఆర్ కు సిరిసిల్ల నియోజకవ‌ర్గంలో లో ఓటమి అనేది లేదన్నారు. మీరు గెలిస్తే రామన్న గెలిచినట్లు మీరు ఓడితే రామన్న ఓడినట్లేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి సిరిసిల్ల గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాల‌ని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తుంద‌ని, కెసిఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. కేటీఆర్ నాయకత్వంలో ఐక్యంగా కోట్లాడి సిరిసిల్లతో పాటు రాష్ట్రంలో గులాబీ జెండా విజయానికి కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *