డిక్లరేషన్‌ ఇస్తే కాదు.. డెడికేషన్‌ ఉండాలి

– గతంలో కేసీఆర్‌ దిల్లీ వెళ్లి తెలంగాణ సాధించుకొచ్చారు
– రిజర్వేషన్‌ బిల్లు సాధించేదాకా దిల్లీలో దీక్ష చేయండి
– అఖిలపక్షానికి సమయం తీసుకోండి.. మేమూ వస్తాం
– రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స‌వాల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: గతంలో తెలంగాణ సాధించుకొస్తానని దిల్లీకి వెళ్లి కేసీఆర్‌ సాధించారని, అదే రీతిలో దమ్ముంటే బిసీ రిజర్వేషన్‌ బిల్లు సాధించాలంటే రేవంత్‌ రెడ్డి దిల్లీ జంతర్‌ మంతర్‌లో అమరణ నిరాహార దీక్ష చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ సవాల్‌ చేశారు. బీసీలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లును అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టిన సందర్భంగా దానిపై ఆయన మాట్లాడుతూ కేవలం బీసీ డిక్లరేషన్లు ఇచ్చి వదిలేస్తే సరిపోదు.. డెడికేషన్‌ ఉండాలి అని హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, గతంలో మేం పెట్టిన పంచాయతీరాజ్‌ చట్టంలో, మున్సిపల్‌ చట్టంలో ఎక్కడా సీలింగ్‌ అనే అంశం లేదని స్పష్టం చేశారు. అపాయింట్‌మెంట్‌ అడిగితే దిల్లీలో చెప్పులు ఎత్తుకు పోతారని రేవంత్‌ రెడ్డి మాట్లాడిన తర్వాత అపాయింట్‌మెంట్‌లు ఎందుకు ఇస్తారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి, మాట తీరు మార్చుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్లు తెలంగాణలో ఆమోదం పొందకముందే తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్‌లో ముఖ్యమంత్రి తన ఫోటోలతో పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడని విమర్శించారు. భారత దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు ఓబీసీ వెల్ఫేర్‌ శాఖ పెట్టాలని డిమాండ్‌ చేసిన నాయకుడు కేసీఆర్‌ అని, 2004లోనే కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ పెట్టాలని డిమాండ్‌ చేశారని, 2002లోనే బీసీ పాలసీని పార్టీ తరఫున తీసుకొచ్చిన నాయకుడని చెప్పారు. రాహుల్‌ గాంధీ కంటే ముందే కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. జనగణనతోపాటు కులగణన కోసం డిమాండ్‌ చేశారన్నారు. ‘శాసనసభలో ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా ఇది మన పరిధిలో లేదన్న అంశం ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు తెలియదనుకోవడం లేదు.. 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇరుక్కుపోయింది. అందుకే తమ పరిధిలో లేని అంశంపై చట్టం తీసుకొచ్చి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నద’ని కేటీఆర్‌ విమర్శించారు. ఎంతమంది ఉంటే అంత ప్రాతినిధ్యం ఉండాలని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు.. మరి 42% రిజర్వేషన్‌ అంశంపై ఆయన పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. మార్చిలో బిల్లు పాస్‌ చేసిన దానికి, దీనికి తేడా ఏమిటో ఇప్పుడు చెప్పండి.. అప్పుడు చేయని రాష్ట్రపతి, గవర్నర్‌ ఇప్పుడు ఎలా చేస్తారు? ప్రభుత్వాలు చేసిన చట్టాలు లొసుగులు లేకుండా చేసుకుంటే మంచిది అని హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *