– చుక్క నీటినీ వదులుకునేది లేదు
– కృష్ణా జలాల్లో 904 టీఎంసీల నీటి కోసం పట్టుబట్టాలి
~ న్యాయ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటాలో ఒక చుక్క కూడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో దిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ ఎదుట ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపె శనివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎంతోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ కె.వోహ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఇఎన్‌సి అంజద్ హుస్సేన్, సీఎంవో సెక్రెటరీ మాణిక్‌రాజ్, ఇరిగేషన్ అధికారులలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకాలం కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి మనకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి న్యాయ నిపుణులకు పలు సూచనలు చేశారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్‌కు సమర్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన, అసంపూర్తిగా ఉన్న, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంటన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటినుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్‌కు అందించాలని చెప్పారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గత పదేండ్లు కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిరడి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండిరగ్‌లో పెట్టిందన్నారు. నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతోపాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తోందని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందని అన్నారు. ఎక్కడపడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవడంతోపాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్‌కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏపీ కారణంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకు వచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ విషయాలపై ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సీఎం అన్నారు. సాగునీటి, తాగునీటి అవసరాలతోపాటు మెట్ట ప్రాంతం, కరవు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ తరఫున వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతోపాటు కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే వాదనలు కావటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని సీఎం న్యాయ నిపుణులకు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





