“ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగబోతోందో ఇప్పుడే జోస్యం సులభంగా చెప్పవచ్చు. ఈ అపరిష్కృత పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగ వలసిందేనా? నిత్య క్షామ పీడిత ప్రాంతాలుగా ఉన్న దక్షిణ తెలంగాణ రాయలసీమ ఎడారిగా ఉండ వలసినదేనా? రెండు రాష్ట్రాల మధ్య కనీస సామరస్యం లేనందున విలువైన కృష్ణా జలాలు సముద్రం పాలు కావలసిందేనా? విలువైన నీళ్లు సముద్రం పాలౌతుంటే గొంతెండి పోతున్న తెలంగాణలోని దక్షిణ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ క్షామ పీడిత ప్రాంతాలుగా ఉండి పోక తప్పదు. గత నీటి సంవత్సరంలో శ్రీ శైలం జలాశయానికి 1600 టీఎంసీలు నీళ్లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం బ్యారేజీ నుండి 860 టిఎంసిలు సముద్రంలో కలసి పోయాయి. సగానికి పైగా సముద్రం పాలైనవి. ఎందుకిలా జరిగింది?”

వాణి వీణ కవల పిల్లల వ్యథాభరిత జీవితం మనకు తెలుసు. దురదృష్టం కొద్దీ నేడు సాగునీటి రంగంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల జల వివాదం అచ్చం ఆలాగే ఉంది. కను చూపు మేర కాంతి పుంజం కనిపించడం లేదు. అంతటా గాఢాంధకారమే అలుముకొని ఉంది . సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం ప్రతి ధ్వనిస్తోంది. కౌన్సిళ్లు ట్రిబ్యునల్స్ రెండూ కూడా తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించే పరిస్థితి కనిపించడం లేదు . రేపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎవరి ప్రయోజనాలకు వ్యతిరేకంగా వచ్చినా ఎవరో ఒకరు సుప్రీంకోర్టు తలుపు తట్టక మానరు. తాజాగా కేవలం గోదావరి వరద జలాలతో ఆంధ్ర ప్రదేశ్ బనకచర్ల అనుసంధానానికి తలపడితేనే తెలంగాణలో బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత దాకా అయినా వెళ్లి సుప్రీంకోర్టు కు వెళతామని ఒకరి కొకరు పోటి పడి ప్రకటనలు చేశారు. అంతెందుకు 2013 లో ఇదే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు కెక్కి స్టే తెచ్చింది. పదకొండు సంవత్సరాలైనా ఈ స్టే ఆలాగే వుంది.
ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగబోతోందో ఇప్పుడే జోస్యం సులభంగా చెప్పవచ్చు. ఈ అపరిష్కృత పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగ వలసిందేనా? నిత్య క్షామ పీడిత ప్రాంతాలుగా ఉన్న దక్షిణ తెలంగాణ రాయలసీమ ఎడారిగా ఉండ వలసినదేనా? రెండు రాష్ట్రాల మధ్య కనీస సామరస్యం లేనందున విలువైన కృష్ణా జలాలు సముద్రం పాలు కావలసిందేనా? విలువైన నీళ్లు సముద్రం పాలౌతుంటే గొంతెండి పోతున్న తెలంగాణలోని దక్షిణ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ క్షామ పీడిత ప్రాంతాలుగా ఉండి పోక తప్పదు. గత నీటి సంవత్సరంలో శ్రీ శైలం జలాశయానికి 1600 టీఎంసీలు నీళ్లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం బ్యారేజీ నుండి 860 టిఎంసిలు సముద్రంలో కలసి పోయాయి. సగానికి పైగా సముద్రం పాలైనవి. ఎందుకిలా జరిగింది?

అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ కూడా 150 టిఎంసిలు శ్రీశైలం సాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ కింద నిల్వ చేసుకోవచ్చని అనుమతించి ఉంది . రాష్ట్ర విభజన చట్టం కూడా అమలులో ఉన్న ట్రిబ్యునల్ తీర్పు మేరకు రెండు రాష్ట్రాలు వ్యవహరించాలని నిర్దేశించి ఉంది . మరి విలువైన నీటిని సముద్రం పాలెందుకు చేశారు? తామేదో సాధిస్తామని ప్రకటనలైతే చేస్తారు గాని కళ్ల ముందు సముద్రంలో కలుస్తున్న నీటి గురించి పల్లెత్తు మాట అనరు. మరీ దురదృష్టమేమంటే వరద సమయంలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తీసుకున్న 200 టిఎంసిలు దోపిడీ చేశారని బిఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటన చేశారు. కానీ సముద్రంలో అంతకు నాలుగింతలు ఎందుకు కలిసి పోయాయో ఆయన ఆలోచన చేయరు. ఒకరికొకరు పోటి పడి శ్రీ శైలంలో విద్యుదుత్పత్తి చేసి కింద అవసరం లేకున్నా విలువైన నీళ్లను సముద్రం పాలు చేశారు. తీరా ఫిబ్రవరి మాసానికి రెండు జలాశయాలు ఖాలీ అయ్యాయి. ఈ సందర్భంలో వాస్తవం చెప్పాలి. కృష్ణా యాజమాన్య బోర్డు చెప్పినా తెలంగాణ వినిపించుకోలేదు. తుదకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. వాస్తవ పరిస్థితులు ఇలా వుంటే తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు పోటీ పడి కృష్ణా జలాలు ఇన్ని టీఎంసీలు కావాలని గంభీరమైన ప్రకటనలు చేయడం దేనికి సంకేతం?
తప్ఫొప్పులు చెప్పడం అభిమతం కాదు గాని వందల టీఎంసీలు సముద్రం పాలు చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ఉంటే ఈ ఏడాదికి గత సంవత్సరం క్యారీ ఓవర్ జలాలు మిగిలేటివి… రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న వివాదాలతో పోల్చుకుంటే బనకచర్ల అనుసంధానం చాలా చిన్న అంశమే. గోదావరిలో తెలంగాణ వాటా ఆంధ్ర ప్రదేశ్ కొల్ల గొట్ఠడం లేదు. మాజీ మంత్రి హరీష్ రావు చెబినట్లు మున్ముందు ట్రిబ్యునల్ ఏర్పడితే నికర జలాలు కోరుతుందనే అంశం తప్ప తెలంగాణాకు నష్టం లేదు. ఎందుకంటే గోదావరికి తెలంగాణ ఎగువ రాష్ట్రం. ఆంధ్ర ప్రదేశ్ దిగువ రాష్ట్రం. తెలంగాణ వదిలితేనే ఆంధ్ర ప్రదేశ్ కు నీళ్లు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ తలుపులు ఎత్తేశారు. కాబట్టి దిగువ గోదావరిలో ఎక్కువ వరద వుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల అన్ని తలుపులు దించితే ఆ మేరకు దిగువకు నీళ్లు రావు కదా? ఈ చిన్న అంశం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు తమ మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదం శాశ్వతం చేసుకోవడం పూర్తిగా అవివేకం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యానికి లాకులెత్తడం తప్ప మరో మార్గం లేదు.

అయితే తెలంగాణ వైపు నుండి సామరస్యానికి లేశం కూడా అవకాశాలు కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోడే కొద్దీ బిఆర్ఎస్ పార్టీ బనకచర్ల అనుసంధానం పథకాన్ని నెగడిగా రగలేస్తోంది. నిజం చెప్పాలంటే బనకచర్ల అనుసంధానం పథకం ప్రతిపాదన ఆంధ్ర ప్రదేశ్ లో అగ్గి రగిలించి ఉండాలి. కాని ప్రతిపక్ష వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఇది తొలుత తన మానస పుత్రిక కాబట్టి మౌనం పాటించుతున్నారు. వామపక్షాలు పలువురు రైతు సంఘాల నేతల వాదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే తెలంగాణ వైపు భిన్నంగా ఉంది. వచ్చే ఎన్నికల వరకు బిఆర్ఎస్ పార్టీ ఈ ఆరని చిచ్చును రగుల్చుతూనే ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ తో ఏదో ఒక పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు లేవు. రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక ఒప్పందం జరిగితే ఇరువురు కూడా ఎంతో కొంత వదులు కోవలసి ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకొనేందుకు గోరంతను కొండంత చేసే రాజకీయ పరిస్థితి తెలంగాణలో ఉంది . ఇవన్నీ అటుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో టిడిపిలో ఉండడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి రంగంలో ఏదో ఒక ఒప్పందం కుదరడానికి పెద్ద అవరోధంగా ఉంది. మున్ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చినా ఎట్టి ప్రయోజనం ఉండదని తెలిసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణలో 500 టిఎంసిలు అడిగారు. మరీ చోద్యమేమంటే ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చేట్టు భావించి అంత తక్కువా అని బిఆర్ఎస్ నేత హరీష్ రావు అనడమే. సాగునీటి రంగంలో ఏ మాత్రం పరిచయమున్న వారు ముక్కు మీద వేలు వేసుకోవలసినదే.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం కుదిరే అవకాశాలు లేవు. రాయలసీమలో మిగులు జలాల ఆధారంగా నిర్మింపబడిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా అంగలార్చుతుంటే తెలంగాణలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లోపు రాజకీయ నేతల మాత్రం తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకొనేందుకు సాగునీటి రంగాన్ని ఇంధనంగా వాడుకుంటారు.





