– ఒకే అంశం.. ఆరు ఎఫ్‌ఐఆర్‌లు
– అన్ని కేసుల్లోనూ హైకోర్టు స్టే
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ముఖ్యమంత్రిని దూషించారంటూ బీఆర్‌ఎస్ హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో ఆరు ఎఫ్‌ఐర్‌లను నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారనే ఒకే అంశంపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లను ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. అన్ని ఎఫ్‌ఐఆర్‌ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేతరహా ఆరోపణలకు చెందిన ఫిర్యాదులపై వేర్వేరు పీఎస్‌లలో ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకేతరహా అభియోగంపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్‌పై బంజారాహిల్స్, మరో ఐదు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలను జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్‌రెడ్డి పరువు నష్టం కలిగించే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. ఇది తీవ్రమైన విషయంగా పరిగణించాలి.. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ సీఎం ప్రతిష్థను దెబ్బతీసేలా మాట్లాడారు.. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టారు.. తప్పుడు సమాచారం వ్యాప్తికి దోహదపడుతున్నారు.. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయి.. కాబట్టి ఆయనపై ఐపీసీలోని సెక్షన్ 504 (ఉద్దేశపూర్వక వ్యాఖ్యలతో శాంతిభద్రతల ఉల్లంఘన), సెక్షన్ 505(2) (శత్రుత్వం, ద్వేషం రేకెత్తేలా ప్రేరేపించడం), సెక్షన్ 500 (పరువు నష్టం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత గుప్తా,్త మరో ఐదుగురు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా పోలీసులు బంజారాహిల్స్, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్‌పల్లి, మోకిల, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని పిటిషనర్ న్యాయవాది టీవీ రమణరావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్‌ను పిటిషనర్ అప్రతిష్ఠపాలు చేస్తున్నారంటూ వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. పిటిషనర్‌పై రాజకీయంగా కక్షసాధింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 ఎఫ్‌ఐఆర్‌లు పిటిషనర్‌పై ఉండొచ్చునని చెప్పారు. అన్ని కేసుల్లోని అభియోగాలు నిరూపణ అయితే ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని చెప్పారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు విరుద్ధమన్నారు. వాదనల తర్వాత హైకోర్టు అన్ని ఎఫ్‌ఐఆర్‌లపై స్టే విధించింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఇతరులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.



