రేపో ఎల్లుండో లేదా
మరికొన్ని స్వల్పకాలపు దినాల్లోనో
మన ప్రయాణం ముగిసిపోవచ్చు కానీ
మన దారిలోని గాలిపాట చెట్ల సంగీతం
నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి
మన జ్ఞాపకాలు అంతే
ప్రయాణపు హడావిడిలో వేగిరపు జీవితం దారిలో
ఎన్నెన్నిటినో చూడకుండానే
జీవితంలోకి ఒంపుకోకుండానే వదిలేసామో కదా
తొలి జోరువానకే పరుగులు పెడుతున్న జీడివాగును చూశావా
అడుగులేయడం నేర్చుకున్న శిశువు
ఆగకుండా ఆనందంతో ఉరికినట్టుగా ఉంటుంది
వాగొడ్డుకిరువైపులా పూసిన గడ్డిపూలు
మనమెటెలితే ఆ వైపుకు మన వేగంతో పాటు
చప్పునా తలతిప్పి చూడటం
నీవు గమనించలేదు కదూ
శిశిరానికి బరిబాధ్ అయిన అడవి
తొలకరికి కొత్తాకులు తొడిగి
ఈడొచ్చిన అమ్మాయంత అందంగా ముస్తాబవడాన్ని
గాలిలో మన పక్కనే పోటాపోటీగా సరిసమానంగా
సయ్యాటలాడుతున్న తూనీగల్ని
అక్కడే తడిమట్టి మీద తిరుగుతూ
ఆరుద్రలు అప్పలోని గుర్రాలు పురుగులు
వాటి కాళ్ళతో గీసిన గిరిక ముగ్గుల చిత్రాన్ని
ఆ పక్కనే ఓ చెట్టుమీద నుండి మరో చెట్టుమీదకి
స్వేచ్చగా దుంకుతున్న కోతుల్ని
వాటి కిందనే ఒకదానివెనుకొకటి గెంతుతూ
ఆడుకుంటున్న పశురాల పిల్లల్ని
ఆ చివరన లోపటికి ఒకదాని మూతిని మరొకటి
ప్రేమగా నాకుతున్న దృశ్యాన్ని
మనం ప్రశాంతంగా పరిశీలించిందెపుడు
మహా గొప్పగా గీసుకున్న యాంత్రిక
ఊహా జీవిత చిత్రంతో మురుస్తున్న మనకు
ఇవన్నీ చిన్నచిన్నవిగానే కనపడవచ్చుకానీ
అసలీజీవితానికి అర్థమేమిటన్న
సారవంతమైన ప్రశ్నెదురై
నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నామనిపించినపుడు
ఓసారి వెనక్కెళ్ళి అవన్నిటిని మనసుతో చూసిరా
మనమెంతటి నిస్తేజపు జీవితాన్ని గడుపుతున్నామో
బోధపడుతుంది అయినా
ఈ మాత్రమైనా ఇరువురి జీవితాలు
కాసింత జీవంతో ఎందుకున్నవో తెలుసా
ప్రయాణంలో ఒకరి చెవిదగ్గరగా ఒకరం మూతులు సాపి
ప్రేమగా చెప్పుకున్న ఊసుల తాలూకు జ్ఞాపకాలు
బలం టానిక్ లాగా ముందుకు నడిపిస్తున్నందుకే ప్రియా
కొత్తాకులు తొడిగి





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల