ప్రియమైన ఇష్టుడా
నీకొక ఉత్తరం రాయక ఎన్నో ఏండ్లు గడిచిపోయినవి
గడిచిన ఇన్నేండ్లలో నీకో ఉత్తరం రాద్దామనుకున్నపుడల్లా
అడ్డుపడి ఆపుతున్న కన్నీళ్లు
లోపలా బయటా భయం ఆవహిస్తున్నపుడూ
లోలోపలి భావాలను స్పష్టంగా ఎట్లా చెప్పగలను చెప్పు
ఈ చీకటి రాజ్యం తెరమీద నీవో వెలుగవుతావని కలగన్నా
కానీ నీ వెలుగే చుట్టేమీ కండ్లబడకుండా చీకటిని తెస్తుందనుకోలేదు
ప్రపంచాన్నే శాసించగల శక్తున్నవాడివనే కదా దేశాన్ని నీ చేతిలో పెట్టింది
మరి దేశంలో విద్వేషపు మంటలు రేగుతున్నపుడూ
మెల్లకుండా మౌనముద్ర ధ్యానంలో మునిగావెందుకు
కనపడితే, వినబడితే నీ సున్నిత హృదయం తట్టుకోలేదనే కదా
నీ మనసులో మాట చెప్పాలనుకున్నపుడల్లా
మేము పల్లెత్తు మాటనకుండా శ్రద్ధగా వింటున్నాము కదా
నీవెంతకు మా మనసులో మాట వినడానికి సిద్ధంగా లేవెందుకు
కోట్లాది హృదయాలలో వెలిగిన వెలుగు నీది
నేడెందుకింత ప్రభ తగ్గుతుందో చెబుదామనుకుంటే
నీ విశాల హృదయపు చెవులకు తాళం వేస్తావెందుకు
నీకోసం నీకిష్టమైన పళ్ళూ కూరగాయలన్నీ
శ్రమజీవుల నెత్తురంటనివి కన్నీటి పారకం లేనివి తీసుకొద్దామని
దేశమంతా వెతికాను ఎక్కడా దొరకలేదు తెలుసా
అందుకేనా
నీవన్నీ విదేశాల నుండే తెప్పించుకు తింటావట కదా
నీదెంత సున్నిత హృదయం అసలు
నీవు నేను కలిసి సాగుచేసుకున్న చేను కదా ఇది
వాడెవ్వడో తేరగా కోసుకుపోతానంటే ఒప్పుకున్నావెందుకు చెప్పు
అధికారపు పందేనికి పైసలు ఇస్తానన్నాడా?
మా హృదయపు పీఠాలకంటే విలువైనదా ఆ అధికార పీఠం
నీ ఎడమకాలితో వాడి మొఖం మీద తన్నీరా సఖుడా
జీవితకాలం మా హృదయాల మీద ఊరేగిస్తూ ఈ దేశాన్ని ఏలిస్తాం
ప్రేమికా మా హృదయ పాలకా
అమ్మ నాకోసం చేసిన ఎద్దుతునకల శోరువా
నేను నీకోసం ప్రేమగా వండిన మునగాకు కూర
సద్దిగట్టుకొస్తున్న సఖుడా
నీవు ఇష్టంగా గట్టిన సంసద్ గార్డెన్లో కూర్చుని
ప్రేమగా ఒకరి హృదయాలను ఒకరం పంచుకుంటూ విందారగిద్దాం
మన ప్రేమకు పుష్కర కాలమైంది అప్పుడే
ఇన్నేళ్లలో నీవెన్ని సార్లు గాయపరిచినా
మా హృదయాలు నిన్నే నిన్నే కోరుకుంటున్నవి ఎందుకో తెలుసా!
ఎవరైతే అందరిలో తన ఆత్మను, తన ఆత్మలో అందరినీ చూస్తారో,
అటువంటి జ్ఞాని ఎవరినీ ద్వేషించడన్న గీతా సారం మనస్సులోకింకి
ఈ నూతన సంవత్సరంతో మన ప్రేమ రాజ్యం స్థాపిస్తావనే ఆశతో
నీకు బోలెడు ముద్దులు కోట్లాది ప్రేమలు ప్రేమికా
-దిలీప్. వి





