– కొప్పుల, కోరుకొండ చందర్‌ల భేటీ
– బెయిల్ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని, జైలులో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు 14 మంది గెలిచినా మంత్రి వివేక్ అధికార దౌర్జన్యంతో ఎన్నికలను నిలిపివేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసి బీఆర్‌ఎస్ నాయకులపైనే కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. సుమన్‌పై ఉన్న పాత కేసులు తోడి బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలని మంత్రి వివేక్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏనాడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. జైలులో అధికారులు సుమన్‌ను మానసిక శోభకు గురిచేస్తున్నారని, దోమలు బాగా ఉన్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. కొంత అనారోగ్యానికి గురైనా వైద్యం అందించడం లేదని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమన్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు రాగా కౌంటర్ పిటిషన్‌పై గడువు కావాలని పోలీసులు కోరగా వాదనలను రేపటికి వాయిదా వేసింది. వారం రోజులకుపైగా సుమన్ మంచిర్యాల జిల్లా జైలులో ఉన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు బంద్ నిర్వహించాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



