– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ సీనియర్ నేత కొండబాల చేరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలాలపాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థలు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా, టీఆర్‌ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనకు చట్టసభలపై చక్కని అవగాహన ఉందని తెలిపారు. అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలను, ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలు తెలుసుకొని వాటి తీర్చేందుకు చేయిచేయి కలిపి పనిచేద్దామని డిప్యూటీ సీఎం అన్నారు.
సొంత ఇంటికి వచ్చిన కొండబాలకు స్వాగతం: పిసిసి అధ్యక్షుడు
సొంత ఇంటికి తిరిగి వచ్చిన కొండబాల కోటేశ్వరరావుకు స్వాగతం తెలియజేస్తున్నానని, ఆయన చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారన్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరుతున్నా: కొండబాల
దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీలో చేరుతున్నట్టు కొండబాల ప్రకటించారు. సుదీర్ఘకాలంగా జిల్లాలో అనేక హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. పార్టీలో జిల్లా జనరల్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్లానని, కాంగ్రెస్ అభ్యర్థిగా సమితికి సైతం పోటీ చేశానని చెప్పారు. పేదల కోసం పనిచేసేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు, పేదల కోసం పబ్లిక్ సెక్టార్‌లో పరిశ్రమలను నెలకొల్పిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకు దక్కిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ఇందుకు తనవంతు సహకరించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు కొండబాల ప్రకటించారు. తనతోపాటు ప్రస్తుతం కొంతమంది వచ్చారని, రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిపారు.




