మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

– రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే త్యజించారు
– ఆయన ఆశయాలకనుగుణంగా రేవంత్‌ పాలన
– ఆయన జయంతి కార్యక్రమంలో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాట బాటలు వేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన ఆశయాలకనుగుణంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ 110వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యజించిన మహనీయుడని మంత్రి కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ముందు తరాలకు తెలిసేలా హార్టీకల్చర్‌ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టామని, అదేవిధంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టామని మంత్రి తుమ్మల తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత కార్మికులకు రుణ మాఫీ చేశామని, చేనేత రంగాన్ని ప్రోత్సహించటానికి సీఎం రేవంత్‌ రెడ్డి చొరవతో బతుకమ్మ చీరలు వర్క్‌ ఆర్డర్‌తో చేనేత కార్మికులు నిలదొక్కుకునేలా ప్రజా ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *