– కాంగ్రెస్‌లో ఒంటరవుతున్న కొండా సురేఖ
– మంత్రివర్గ సమావేశానికి డుమ్మా
– రెడ్డి వర్సెస్ బీసీగా మారుతున్న వివాదం
– పార్టీని కుంగదీస్తున్న విభేదాలు
– జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం పడే అవకాశం
– పార్టీ పెద్దల్లో కలవరం
(మండువ రవీందర్‌రావు)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఒకపక్క విపక్షాల దాడులను ఎదుర్కుంటూనే అంతర్ఘత విభేదాలతో సతమతమవుతున్నది. మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం, ఎమ్మెల్యేలకు మంత్రికి మధ్య కొనసాగుతున్న వివాదాలను తీర్చడానికే ఆ పార్టీకి సమయం సరిపోవడంలేదు. వారి మధ్య ఎంత సామరస్యాన్ని కుదర్చినప్పటికీ మానసికంగా ఒకటికాలేక పోతున్నారనడానికి తరచూ తలెత్తుతున్న వివాదాలే తార్కాణం. ఆధిపత్యపోరే ఇందుకు ప్రధాన కారణం. అందులో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దానికి తగినట్లు ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో దూరం పాటిస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి మరణంతో ఆయన్ను పరామర్శించేందుకు వరంగల్ వచ్చిన సీఎంను కలవకపోగా, గురువారం నాటి కేబినెట్ సమావేశానికి కూడా ఆమె డుమ్మా కొట్టడం చూస్తుంటే సురేఖ ఏకాకి అవుతున్నట్లు స్పష్టమవుతున్నది. బుధవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర జరిగిన హై డ్రామా కాంగ్రెస్‌లో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయనడానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నది. వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులుగా భావిస్తున్న కొందరు మఫ్టీలో ఆమె ఇంటికి వచ్చారన్న విషయంలో గొడవ జరిగింది. మంత్రి సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ శాఖలో ఓఎస్డీగా భాద్యతలు నిర్వర్తిస్తున్న మాజీ అధికారి సుమంత్ కోసం వారు వచ్చినట్లు తెలుస్తోంది. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో సుమంత్‌ను ఆ పదవినుంచి తొలగించారు. అభివృద్ధి పనుల్లో సుమంత్ జోక్యం పెరిగిందని, ఇటీవల మేడారం పనుల వివాదానికికూడా ఆయనే కారణమన్న ఆరోపణలున్నాయి. అంతేగాక డక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను రివాల్వర్‌తో బెదిరించాడన్నది ఆయనపైన ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలుస్తున్నది. అయితే ఆయన్ను ఆ పదవినుండి తొలగిస్తున్న విషయం సంబందిత శాఖ మంత్రిగా తన దృష్టికి తీసుకురాకపోవడమన్నది మంత్రి సురేఖకు ఆగ్రహం కలిగించిన విషయంగా పేర్కొంటున్నారు. పదవినుండి తొలగించిన తర్వాతనుండి సుమంత్ కనిపించడంలేదు. ఆయనకు మంత్రి ఇంట్లో ఆశ్రయం కల్పించారేమోనన్న అనుమానంతో మఫ్టీలో పోలీసులు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంలో మంత్రి సురేఖ కూతురు సుష్మిత పటేల్‌కు, పోలీసులకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ కుటుంబంపై తమ పార్టీ వారే పగబట్టారని, బీసీ మహిళ అయిన తన తల్లిని రాజకీయంగా అణదొక్కాలన్న కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయంగా ఉండటమే తమ తల్లిదండ్రులు చేసిన తప్పిదమా అని ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
పలు వివాదాల్లో చిక్కుకున్న సురేఖ
మంత్రి సురేఖ ఇటీవల పలు వివాదల్లో చిక్కుకున్నారు. సినీ నటుడు నాగర్జున కోడలు సమంతపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేఖకు ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో పొసగకుండా పోయింది. వారంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌లకు ఫిర్యాదు చేయడం, తాము కావాలో కొండా సురేఖ కావాలో తేల్చుకోమనడంతో పార్టీపై తీవ్ర వత్తిడి పెరిగింది. వారి మధ్య ఏదోవిదంగా సయోధ్య కుదిర్చామని కాంగ్రెస్ పెద్దలు ఊపిరి తీసుకున్నారో లేదో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం కులాల మధ్య కుంపటిలా మారుతున్న తరుణంలో పొన్నంతో లక్ష్మణ్‌కు సారీ చెప్పించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య వివాదం తలెత్తింది. తన శాఖలో రెవెన్యూ మంత్రి పెత్తనమేంటన్న సురేఖ ఆగ్రహం ఆమె ఉనికికే ముప్పుగా మారింది. దేవాదాయ శాఖ అధ్వర్యంలో మేడారంలో చేపట్టనున్న రూ.71 కోట్ల పనుల విషయంలో అనవసరంగా ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జి మంత్రి అయిన పొంగులేటి ల్ణజోక్యం తీసుకోవడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అది చినికిచినికి గాలివానగా మారింది. కొండాకు అనుకూలంగా పరిధులు దాటి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణపై గతంలో ఏసీపీిపై వేటు వేసినట్లుగానే ఆమె శాఖలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఓఎస్డీ సుమంత్‌ను ఆ పదవినుండి తప్పించడం ద్వారా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఇదిలాఉంటే మేడారం అభివృద్ధి పనుల విషయంలో ఆమె జోక్యం లేకుండా పనులను ఆర్‌అండ్‌బి శాఖకు అప్పగించటం ఒకటైతే అందుకు సంబంధించిన ఫైల్‌ను కూడా ఆర్‌ఆండ్‌బీకి అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే ప్రభుత్వం క్రమంగా ఆమె పవర్‌ను తగ్గించే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అంతేగాక సురేఖ ఇంటి దగ్గర సెక్యూరిటీని కూడా వెనక్కు పిలిచినట్లు వార్తలొస్తున్నాయి. వీటన్నిటి దృష్ట్యా సురేఖ మంత్రి పదవిలో ఉంటారా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలావుంటే గురువారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి కూడా కొండా హాజరుకాకపోవడంతో పరిస్థితి సీరియస్‌గానే మారినట్లు కనిపిస్తున్నది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్‌తో ముందుగా కేబినెట్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చినప్పటికీ హాజరుకాకపోగా మీనాక్షితో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీపీిసీసీ అధ్యక్షుడు కూడా పాల్గొన్నట్లు తెలుస్తున్నది. చర్చల సారాంశాన్ని అధిష్ఠానానికే వదిలేసినట్లు మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం సురేఖ మీడియాకు చెప్పడం మరో కొత్త ట్విస్ట్. ఓ పక్క జూబ్లీహిల్స్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో కొండా ఎపిసోడ్ ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ పోయే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. క్యాబినెట్ సమావేశానంతరం కొండా సురేఖ పరిస్థితి ఏమిటన్న డైలమా కొనసాగుతున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





