తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జగ్గారెడ్డి అన్నివిధాలా అర్హుడంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీ కప్పులో తుపానును రేకెత్తించేవిగా ఉన్నాయి. అసలే బడ్జెట్ సమావేశాల్లో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి తదితర మంత్రులకు ఈ వ్యాఖ్యలు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయనుకోవాలా లేక బీఆర్ ఎస్ విమర్శల దాడులనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పన్నిన వ్యూహమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఒక నాయకుడు ఒక పదవి అనే నిబంధన ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల్లో ఆశలు రేకెత్తిస్తున్నమాట వాస్తవం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.ఆయనకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిపై అప్పుడే పార్టీ సీనియర్లలో పోటీ మొదలైందన్న సంగతి స్పష్టమవుతోంది.
ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ప్రెస్‌మీట్‌లో ఈ పదవికి టి.జగ్గారెడ్డి అన్ని విధాలా అర్హుడని పేర్కొనడంతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అంతర్గతంగా పోటీ ఉన్నదన్న సంగతి మరింత స్పష్టమైంది. మంగళవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేయడమే కాదు, జగ్గారెడ్డికి ఈ పదవి ఇచ్చినట్లయితే వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వంద సీట్లు ఖాయమని కూడా చెప్పడంతో, అసెంబ్లీ సమావేశాల హీట్‌తో పాటు పార్టీ అధ్యక్షపదవిపై కూడా రాజకీయ వేడి రాజుకుంది. అంతేకాదు ఆయన జగ్గారెడ్డిని దివంగత పి.జనార్థన్‌రెడ్డితో పోల్చడం విశేషం. స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగిన జగ్గారెడ్డి పార్టీ విజయానికి బాటలు వేయగలుగుతారని, గతంలో జనార్థన్‌రెడ్డి ప్రజల్లో ఎంతటి స్థాయి పలుకుబడి ఉన్నదో, అంతేస్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే సత్తా జగ్గారెడ్డికి ఉన్నదని చెప్పడం కీలకంగా మారింది.
2024 సెప్టెంబర్ 6 నుంచి పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ పదవికి ఎసరుపెట్టే రాజకీయాలు నడుస్తున్నాయన్న అనుమానా లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు తావిచ్చినట్లయింది. ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, విపక్ష బీఆర్‌ఎస్ నేతలనుంచి తీవ్ర స్థాయి విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలతో ముందుకెళ్లే పనిలో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదొక తలనొప్పి గా మారుతుందనడంలో సందేహం లేదు. ఒక్కరోజులో ఏం జరిగిందో తెలియదు కానీ, బుధవారం మళ్లీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్న తాను చేసిన వ్యాఖ్యలు మహేష్‌కుమార్ గౌడ్‌ను తక్కువ చేసేందుకు చేసినవి కావని, కేవలం తన అభిప్రాయం వ్యక్తం చేశానని చెప్పి వివాద తీవ్రతను తగ్గించడానికి యత్నించడం గమనార్హం.
ఇప్పటికే ఈ పోస్టుకు పోటీలో ఉన్న మధు యాష్కీ గౌడ్, పి. బలరామ్ నాయక్, ఎస్.ఎ. సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి వంటి వారికి ఈ పోస్టుకు అర్హత సాధించేందుకు బలమైన నేపథ్యాలనే కలిగిఉన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడి విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను పార్టీ అధిష్టానం ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఎంపిక కార్యక్రమం కొనసాగించడం పరిపాటి. సీనియర్ నాయకుల మధ్య ఈ పోస్టు విషయంలో పోటీ ఉండటం సహజమే. అందులో తప్పేం లేదు. కాకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమస్యను లేవనెత్తిన సమయం పైనే పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ఏదో ముందుగా ఒక ప్రణాళిక వేసుకొని అందుకు అనుగుణంగా చేసినవి కావన్న సంగతి అనంతర పరిణామాలు వెల్లడిస్తున్నప్పటికీ సంతృప్తికరంగా లేవు.
రాజకీయ నాయకులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు చేసే వ్యాఖ్యలు, వెల్లడించే అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంటుంది. ఆచితూచి మాట్లాడకపోతే ముఖ్యంగా మీడియాతో వ్యవహరించే విషయంలో జాగ్రత్త వహించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నష్ట నివారణ కోసం ఆయన బుధవారం ప్రయత్నించినప్పటికీ, అంతటి సీనియర్ నేత అనవసరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయరన్న సంగతి చాలా స్పష్టం. సందర్భ మే కాని సమయంలో జగ్గారెడ్డికి అనుకూలంగా మాట్లాడటం ద్వారా, కోమటి రెడ్డి వర్గం, ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి వేసి “తరంగాల వాటం” ఎటువైపు ఉన్నదో తెలుసుకోవడానికి చేసిన పరీక్షగా భావించాల్సి ఉంటుందే మో?
కానీ ఒకవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇప్పటికి అనవసర మైన ఈ విషయాన్ని లేవనెత్తడం కేవలం పక్కదోవ పట్టించే యత్నమా? ముఖ్యంగా బీఆరఎస్ నాయకులు కేటీఆర్, హరీష్‌రావులు గణాంకాలతో సహా మూసీ ప్రాజెక్టు, హెచ్ఎండీఎ, ఆరు హామీల అమలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సమస్యలపై నిలదీస్తుండటంతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడుతోంది. దీటైన రీతి సమాధానాలతో వారిని ఎదుర్కొన లేకపోతున్నదన్నది సమావేశాల తీరుతెన్నులు చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. సమర్థించుకోవడానికి వీల్లేని రీతిలో విపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శలనుంచి ప్రజలను దృష్టి మళ్లించే ప్రక్రియలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎపిసోడ్ ఒక భాగమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవు తున్నాయి. కాంగ్రెస్ శైలి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!





