కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిన్న పర్యటించినపుడు వచ్చే పదేళ్లు తానే సీఎంనని రాసిపెట్టుకో అంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో కొద్ది రోజులుగా కాంగ్రెస్ పెద్దలపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో తన అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని రాజ్‌గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.





