మల్కాపూర్‌-విజయవాడ రహదారిని విస్తరించాలి

– ఇతర పెండిరగ్‌ జాతీయ రహదారులను ఆమోదించాలి
– కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి

న్యూదిల్లీ, ఆగస్టు 5: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని మల్కాపూర్‌ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించడంతోపాటు సర్వీస్‌ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. డెత్‌ రోడ్డుగా పిలిచే హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై (ఎన్‌హెచ్‌-65) జూలై 27న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన గడ్కరీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేస్తున్న తాను ప్రతిరోజూ ప్రమాదాల వార్తలను వినడం, కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూడటం బాధ కలిగిస్తున్నదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఈనెల 15న నిర్వహించే ఫైనాన్స్‌ మీటింగ్‌లో ఎన్‌హెచ్‌-65 విస్తరణను ఆమోదిస్తామని, త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు.
సంగారెడ్డి టు చౌటుప్పల్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. నాలుగు వరుసలుగా నిర్మించాలనుకున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డును భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరు వరుసలుగా నిర్మించేందుకు అంచనాలు సవరిస్తున్నామని, టెండర్లను సైతం అందుకనుగుణంగా ఫైనలైజ్‌ చేస్తామని గడ్కరీకి వివరించారు.
రివైజ్డ్‌ ఎష్టిమేషన్‌తో మూడు నెలల్లో ఉత్తర భాగం పనులు మొదలుపెట్టాలని, అంతేకాక ఉత్తర భాగంతోపాటే దక్షిణ భాగం కూడా యుద్ధప్రతిపాదికన ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని గడ్కరీని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో వేగంగా పనులు చేపడితే అనుకున్న వ్యయంలోనే భూసేకరణ పూర్తవుతుందని, ఆలస్యం జరిగితే భూసేకరణ ధరలు పెరిగి ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తిపై పాజిటివ్‌గా స్పందించిన గడ్కరీ అలైన్‌మెంట్‌ ప్రపోజల్స్‌ పంపితే అనుకున్నదానికన్నా ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని గడ్కరీ హామీ ఇచ్చారు.
ఎల్‌బీ నగర్‌ – మల్కాపూర్‌ : చింతల్‌కుంట చెక్‌ పోస్ట్‌ నుంచి హయత్‌నగర్‌, ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్‌ కారిడార్‌గా నిర్మించడంతోపాటు నాగ్‌పూర్‌లో మాదిరి డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌గా నిర్మాణం చేపట్టాలని గడ్కరీని కోరారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు ఇస్తానని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం వియూపీలు నిర్మించడం వలన తీవ్రంగా ఇబ్బందులు పడతామని స్థానిక ప్రజలు కోరుతున్నందున దాన్ని ఎలివేటెడ్‌గా మంజూరీ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్‌ కు సానుకూలంగా స్పందించిన గడ్కరీ.
హైదరాబాద్‌ – శ్రీశైలం రోడ్డు (ఎన్‌హెచ్‌-765) :హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిలో టైగర్‌ రిజర్వ్‌ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్‌ కారిడార్‌గా గుర్తించాలన్న మంత్రి కోమటిరెడ్డి విజ్ఞాపనకు అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ ఇస్తూ మంజూరు చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ రహదారి ప్రాంతం ప్రస్తుతం 62 కి.మీ ఉందని, ఎలివేటెడ్‌ కారిడార్‌గా మారిస్తే 4 కి.మీ తగ్గి 58 కి.మీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌-మన్నెగూడ రహదారికి సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఉన్న అంశాన్ని త్వరగా పూర్తిచేసి కాంట్రాక్టర్‌ను ఒప్పించి త్వరితగతిన పనులు పూర్తిచేయడానికి సహకరించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగారు. వేగంగా అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఇవే కాకుండా సేతు బంధన్‌, సిఆర్‌ఐఎఫ్‌ (సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) నుంచి మంజూరు ప్రతిపాదనల గురించి మంత్రి కోమటిరెడ్డి అడగగా వచ్చే వారం మీ కార్యదర్శితో ప్రపోజల్స్‌ పంపించి మంజూరీ చేయించుకోవాలని గడ్కరీ చెప్పారు. కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశంపై కోమటిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులను వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని, అందుకనుగుణంగానే రాష్ట్రంలో పనులు ముందుకు సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఉప్పల్‌ ఫ్లైఓర్‌ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వీటితో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రహదారులు అందించేందుకు హ్యామ్‌ విధానంలో ఇప్పటికే రోడ్లను ఎంపిక చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *