పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది

– రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి
– ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెపై జలసౌధలో సమావేశం
– హాజరైన రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: మన జిల్లాకు చెందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి కావడం మనకు సానుకూలాంశమని, పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ వేగవంతమవుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై జలసౌధలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రమంతా వర్షాలు పడ్డా నల్గొండ జిల్లాలో కట్టంగూరు, మునుగోడు, నార్కట్‌పల్లిలో వర్షాలు అతి తక్కువ పడ్డాయని, ఇప్పుడు తాగునీటి సమస్య ఉందని చెప్పారు. రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని, పంపులు సిద్ధంగా ఉన్నాయని, రైతులు నీటి కోసం చూస్తున్నారంటూ అధికారులకు ప్రతిసారీ చెప్పాలా అని ప్రశ్నించారు. వాటర్‌ పంపింగ్‌ చేసి రిజర్వాయర్‌ ద్వారా సాగు నీరందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అప్రోచ్‌ కెనాల్స్‌ పూర్తి చేసి దిగువన చెరువులు నింపాలనే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే కొత్త ఆయకట్టు సృష్టించామని, అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు వేసినా ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రివైజ్డ్‌ టెండర్లు వేయలేదని చెప్పారు. రైతులకు సాగునీరు అందించాలని పైపు లైన్‌ కోసం సొంతంగా రూ.30లక్షలు ఖర్చు చేశానని, రూ.300 కోట్లు బ్రాహ్మణ వెల్లెంల కోసం కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. 10 శాతం నిధులు సుమారు రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని తెలిపారు. తాను 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డిని ఒప్పించి ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి శ్రీకారం చుట్టామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్‌ ప్రాజెక్టు అని, ఇది పూర్తి అయితే కృష్ణాలో కేటాయించిన నీటిని గ్రావిటీ ద్వారా తెచ్చుకోవచ్చని కోమటిరెడ్డి చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో పదేళ్లు పక్కనపెట్టారని విమర్శించారు. 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి, ఇరిగేషన్‌ మంత్రి చెప్పడం సంతోషకరమన్నారు. సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ చాలా విలువైనవని, అవి చివరి వరకు అందేలా లైనింగ్‌ కోసం టెండరింగ్‌ చేసినందుకు ఇరిగేషన్‌ మంత్రికి రైతుల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు. నార్కట్‌పల్లి మండలం జిల్లాలో ఫ్లోరైడ్‌ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒకటని, అందుకే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. రిటైర్డ్‌ ఇంజనీర్లతో పలుమార్లు స్వయంగా చర్చించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుకున్నామని, రిజర్వాయర్‌ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రారంభించామని, ఉదయ సముద్రం తాగునీటిని నిర్వహిస్తూ బ్రాహ్మణ వెల్లెంలకు క్రమం తప్పకుండా వాటర్‌ పంపింగ్‌ చేయాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *