– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బి అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను ఆర్‌అండ్‌బి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్షించిన మంత్రి, కాజ్‌వేలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాల గురించి తెలుసుకున్నారు. కామారెడ్డి, నిర్మల్ వద్ద వరద ప్రవాహానికి ఎన్‌హెచ్ 44పై రాకపోకలకు ఏర్పడిన అంతరాయం, ట్రాఫిక్ క్లియరెన్స్‌పై మంత్రి ఆరా తీశారు. జాతీయ, రాష్ట్ర హైవేల స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సీజన్‌లో అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు, కల్వర్టుల, ముఖ్యంగా ఇంకా రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల రోడ్ల వివరాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు తెగినచోట, కల్వర్టులు పొంగిపొర్లుతున్నచోట, వాగులు ఉదృతంగా ప్రవహించే మైనర్ బ్రిడ్జిల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని, తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద వర్షాలు తగ్గుముఖం పట్టగానే తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆర్‌అండ్‌బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులు, సమాచార వివరాలపై మంత్రి ఆరా తీయగా స్టేట్ రోడ్స్ సి.ఈ ఆధ్వర్యంలో షిఫ్టుకు నలుగురు చొప్పున 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. వరదలకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ అండ్‌బి పరిధిలోని 37 డివిజన్లలో 794 చోట్ల సమస్యాత్మక రోడ్లు గుర్తించామని, అందులో 1039 కి.మీ రోడ్డు దెబ్బతిందని, 31 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 10చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశామని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఆర్‌అండ్‌బి) మంత్రికి వివరించారు. 356 చోట్లలో కాజ్ వేలు, కల్వర్టులు వరద ప్రవాహం ఉంటే అందులో 289 దారి మళ్లింపు చేసినట్లు తెలిపారు. రాకపోకలకు ఇబ్బంది ఉన్న 305 ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన 236చోట్ల క్లియర్ చేశామని, మిగతాచోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామన్నారు. మొత్తంగా 206 చోట్ల సిడి వర్క్స్ దెబ్బతిన్నాయని, రోడ్లు, కాజ్ వే,మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించాలని ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.53.76 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, శాశ్వత పునరుద్ధరణకు రూ.1157.46 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆర్ ండ్‌బి అధికారులు యుద్దప్రాతిపదికన చేపట్టిన చర్యలు, క్షేత్రస్థాయిలో చూపిన పని తీరును అభినందించిన మంత్రి, అలసత్వం వహించకుండా.. అదే స్పూర్తితో రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు ఆర్ అండ్ బి ఇంజనీర్లు అధిక వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తూ..పరిస్థితులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, ఏ రోజుకు ఆరోజు వివరాలు ఉదయం, సాయంత్రం తనకు రిపోర్ట్ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.





