రచయిత, కవి, విమర్శకులు పలమనేరు బాలాజి రాసిన ‘ఏకలవ్య కాలనీ’ కథాసంపుటికి ‘కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం- 2026’ లభించింది. ఫిబ్రవరి 26వ తేదీ హైదరాబాదు, తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో కొలకలూరి భాగీరధి కథానిక పురస్కారాన్ని పలమనేరు బాలాజీకి అందజేస్తున్నట్లు కొలకలూరి సాహిత్య పురస్కారాల నిర్వాహకులు, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.
పలమనేరు బాలాజి (52) కథ, కవిత, నవల, విమర్శ ప్రక్రియల్లో 36 సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు. నాలుగు కథా సంపుటాలు, మూడు కవితా సంపుటాలు, ఒక నవల వెలువరించారు. 1991లో తెలుగుభాషలో గిరిజన సమూహాల నుండి కథలు రాసిన మొదటి రచయితగా పరిశోధకులు గుర్తించారు. బాలాజీ రచనలు తమిళ, కన్నడ మలయాళం, తుళు, ఆంగ్ల, కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యాయి. 2024లో ప్రసిద్ధ ప్రచురణ సంస్థ పర్స్పెక్టివ్స్ హైదరాబాద్ వారు ఎరుకల జీవనగాథలను ‘ఏకలవ్య కాలనీ’ పేరిట ప్రచురించారు.





