– ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలి
– ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: ప్రత్యేక రాష్ట్రం కోసం వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో పోరాటం చేసిన ఉద్యమకారులు సంఘటితంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమితి కార్యాలయంలో సోమవారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ జేఏసీలుగా, సంఘాలుగా ఏర్పడి సంఘటితమై రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అదే స్పూర్తితో ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, ఉద్యమకారుల సంక్షేమం కొరకు అందరం సమిష్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ ఉద్యమకారులు ఎంతో నిజాయతీగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని, ఈ ప్రభుత్వమైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉద్యమ సంఘాల జేఏసీలు, ఉద్యమకారుల సంక్షేమ సంఘాలు, 69 ఉద్యమకారుల ఫోరం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అనంతరం సమావేశం మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర సాధన ఏ ఒక్కరివల్లనో జరగలేదు. ప్రజలందరూ సమిష్టిగా సకల జనులు మమేకమై సాధించినది. ఈ రాష్ట్రం ఏ ఒక్కరి ప్రయోజనాల కోసమే కాకుండా ఉద్యమ ఆకాంక్షలతో కూడిన రాష్ట్రంగా నిర్మాణం జరగాలి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు సమున్నత గౌరవం కల్పిస్తామని, ఉద్యమకారుల సంక్షేమానికి పూనుకుంటామని, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సమావేశం కోరింది. ఉద్యమ ఆకాంక్షల సాధనకు, ఉద్యమకారుల సంక్షేమం కోసం కోదండరాం నాయకత్వంలో సమన్వయంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసింది. స్వరాష్ట్రంలో గత పదేళ్లలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు కనీస గౌరవం ఇవ్వలేదు. ఉద్యమకారుల సంక్షేమం గూర్చి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు పూనుకొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సమావేశంలో సిపిఐ.ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే గోవర్ధన్, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ ప్రపుల్ రామ్ రెడ్డి, వివిధ ఉద్యమకారుల సంఘాల నేతలు తెలంగాణ వెంకన్న, రమాదేవి, రామగిరి ప్రకాష్, శ్యాంసుందర్ గౌడ్, అంజిరెడ్డి, కుమారస్వామి, రామ్మూర్తి,గొల్లపల్లి నాగరాజు, ఆర్టీసీ జేఏసీ లాలయ్య, మల్లయ్య, 1969 ఉద్యమకారులు తిప్పన సిద్దులు, నలమాస స్వామి, రాజేంద్ర బాబు. తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు దర్మార్జున్, పల్లె వినయ్, తుల్జారెడ్డి ఆశప్ప, నిజ్జన రమేష్, హనుమంత్ రెడ్డి, ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





