– ‘నిట్’ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి
– కిట్స్ వరంగల్ 42వ వార్షిక స్నాతకోత్సవం
వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఆశయంలో ధైర్యంగా ప్రవర్తనలో వినయంగా మీ సామర్థ్యాలపై నమ్మకంగా ఉండండి.. కానీ నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు అని వరంగల్ ‘నిట్’ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి విద్యార్థులకు ఉద్బోధించారు. కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో 42వ యాన్యువల్ గ్రాడ్యుయేషన్ డే శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి సుబుధి, గౌరవ అతిథి కాకతీయ యూనివర్సిటీ వరంగల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, కోశాధికారి పి.నారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోకరెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సుబుధి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కిట్స్‌లో మీ విద్యా ప్రయాణం ముగింపు మాత్రమే కాదు.. బాధ్యతలు, అవకాశాలతో నిండిన ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు. సమర్థ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను రూపొందించడంలో విశిష్ట ఖ్యాతిని కిట్స్ వరంగల్ సంపాదించిందన్నారు. సాంకేతిక జ్ఞానం ఒక సాధనం మాత్రమే.. మీరు దానిని ఎలా ఉపయోగిస్తారనేది మిమ్మల్ని నిర్వచిస్తుంది. సంక్లిష్టతలు, అవకాశాలతో నిండిన ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నప్పుడు స్థిరమైన అభివృద్ధి కోసం ఆవిష్కరణ, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అత్యంత డిమాండ్ ఉన్న ఈ సంస్థ వారసత్వం, ఉత్సాహపూరితమైన విద్యా వాతావరణం, భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం, రాబోయే సవాళ్లను స్వీకరించడం తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. వైఫల్యాలు పాఠాలు కావాలన్నారు. ఫలవంతమైన జీవితాన్ని గడపడానికి విజయం వైపు తులనాత్మక, ప్రగతిశీల మనస్సుతో ఉండండి.. జీవితాంతం నేర్చుకోవడం, సమగ్రత, సమాజానికి తిరిగి ఇవ్వడం అనే మూడు సూత్రాలతో మీరు ఆవిష్కర్తలు, సమస్య పరిష్కారాలు, మార్పు సృష్టికర్తలు అని గుర్తుంచుకోండి అని ఆయన సూచించారు.
మూడు సూత్రాలను పాటించాలి :కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ అభ్యాసం, మేధో వృద్ధి పట్ల మీ నిబద్ధత మీ భవిష్యత్ ప్రయత్నాలకు పునాది. నిజాయతీ, అంకితభావం, సేవా దృక్పథం సమాజానికి దోహదపడాలనే లక్ష్యంతో నిరంతర అభ్యాసం కోసం ప్రతి గ్రాడ్యుయేట్ మూడు సూత్రాలను పాటించాలి. విజయం ఒక పరుగు పందెం కాదు.. ఒక ప్రయాణం అని, సాంకేతిక పురోగతి చాలా అవసరం అయితే మనల్ని ముందుకు నడిపించే పునాదిని అంటే అకడమిక్ ఎక్సలెన్స్‌ను మనం మరచిపోకూడదు అని పేర్కొన్నారు.
విమర్శనాత్మకంగా ఆలోచించండి: కెప్టెన్ లక్ష్మీకాంతారావు
రాజ్యసభ మాజీ సభ్యుడు, కిట్స్ వరంగల్ గవర్నింగ్ బాడీ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు తన అధ్యక్షోపన్యాసంలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సౌకర్యాలను ఉపయోగించుకోండి.. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేసుకోండి.. కిట్స్ వరంగల్‌లోని డైనమిక్ గ్రాడ్యుయేట్లు తమ జీవితంలో నిరంతరం విజయాలు సాధిస్తూ, సమాజ నిర్మాణానికి నాంది పలికిన రోజు ఈరోజు అని అన్నారు. ఇప్పటితరం టెక్నాలజీ ప్రపంచంలో పుట్టింది.. సాంకేతికతలో వేగవంతమైన మార్పును ప్రారంభించండి అన్నారు. ఇంజనీర్లు వాస్తవ ప్రపంచ సమస్యలపై పనిచేయాలి కానీ గ్రామీణ, పట్టణ డిమాండ్ల మధ్య అసమానతలను దృష్టిలో ఉంచుకుని డబ్బు కోసం పని చేయకూడదని చెప్పారు.
కిట్స్ బృందం కృషి ఫలితమే మెరిట్ అవార్డులు : ప్రిన్సిపాల్ అశోకరెడ్డి
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక రెడ్డి మాట్లాడుతూ అకడమిక్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16మంది విద్యార్ధినీ విద్యార్థులకు బంగారు పతకాలు, 15 అకడమిక్ మెరిట్ అవార్డులు, డిగ్రీలు బి.టెక్, ఎం.టెక్, ఎంబిఎ గ్రాండ్ అంట్స్ అందజేసినట్లు వివరించారు. బి.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌కి చెందిన మామిండ్లపెల్లి సంజన వివిధ రంగాల్లో 4 బంగారు పతకాలు సాధించిందన్నారు. ఆమె రూ.14 లక్షల సీటీసీతో ఒరాకిల్ కంపెనీలో స్థానం సంపాదించిందన్నారు. బి.టెక్ ప్రోగ్రామ్‌లో గడ్డం నిఖిల్ రెడ్డి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ సాధించారు. పది విభాగాలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక అర్హత కలిగిన అధ్యాపకులను అందించడం ద్వారా తమ విద్యార్థులు సాంకేతికంగా ఉన్నతంగా, నైతికంగా, బలంగా శిక్షణ పొందారన్నారు. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా మంచి స్థానాల్లో ఉన్న 28,150 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఉన్నారని, పరిశ్రమ, విద్య, పరిశోధనలలో బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్నారుని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో తాము చూసిన పురోగతి వాస్తవానికి కిట్స్ బృందం సహకార కృషి ఫలితమేనన్నారు.
కార్యక్రమంలో కోశాధికారి పి.నారాయణ రెడ్డి, కిట్స్ యాజమాన్య కమిటీ సభ్యులు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే, వి.సతీష్ కుమార్, వి.కిషన్ రావు, ఇ.వెంకట్రామ్ రెడ్డి, శ్రీ. కె. దేవి ప్రసాద్, ఎ.సత్యనారాయణ రాజు, డాక్టర్ వి.పవన్, కె.ప్రతాప్ రెడ్డి, ఎ.హరీష్, వి.శ్రీరామ్ రావు, కిట్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ వి.రాజగోపాల్, అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కె.వేణుమాధవ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.కిరణ్ కుమార్, డాక్టర్ ఎస్.ఉమామహేశ్వర్, డాక్టర్ డి.రాజయ్య, యుజి కోర్సుల ఇన్‌చార్జి ఫ్యాకల్టీ డాక్టర్ పి.నాగార్జునరెడ్డి, పీజీ కోర్సుల ఇన్‌చార్జి ఫ్యాకల్టీ డాక్టర్ ఆర్.శ్రీకాంత్, ఆర్.రమేష్, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపకులు, సిబ్బంది, వెయ్యిమందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





