హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించాలి

– 13వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్

– ప్రత్యేక బ్రాండింగ్ తో లోగోను రూపొందించాలి
– ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ వాతావరణానికి తగిన విధంగా హైదరాబాద్ నగరపు సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్ ను ఘ‌నంగా నిర్వహించాలని సూచించారు. ఈ కైట్ ఫెస్టివల్ కు ప్రత్యేక గుర్తింపు, విస్తృత ప్రచారం కల్పించేలా సరైన పేరు, ప్రత్యేక బ్రాండింగ్, ఆకర్షణీయమైన లోగోను రూపొందించాలని సంబంధిత శాఖలను ఆయన ఆదేశించారు.హైడ్రా ద్వారా పున‌రుద్ధ‌ర‌ణ జ‌రిగిన‌ చెరువుల వద్ద ఈఫెస్టివల్ ను నిర్వహించాలన్న‌ ముఖ్యమంత్రి ఆకాంక్షను తెలిపారు. దీని ద్వారా నగరంలోని నీటి వనరుల పునరుద్ధరణలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడం లక్ష్యమని సీఎస్ అన్నారు. గుర్తించిన ప్రదేశాల్లో కైట్ ఫెస్టివల్ కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి సమన్వయం చేయడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రా తరపున ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. జనవరి మొదటి వారం నుంచి రాష్ట్ర మంత్రులు పునరుద్ధరించిన చెరువులను సందర్శించి ఏర్పాట్లను సమీక్షిస్తారని తెలిపారు. హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ నగరవ్యాప్తంగా హైడ్రా ద్వారా పునరుజ్జీవం పొందిన చెరువులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.క్రాంతి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కార్యక్రమాలను తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నామని, ఇందులో దేశీ, విదేశీ గాలిపటాల కళాకారులు పాల్గొంటారని చెప్పారు. అలాగే నగర పరిసర ప్రాంతాల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించి సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా డ్రోన్ పైలట్లు పాల్గొనే డ్రోన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నట్లు, ఇది పండుగ వేడుకలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తుందని వివరించారు. అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సంక్రాంతి వేడుకలను ప్రజలకు మరపురాని అనుభవంగా మార్చాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫ‌రాజ్‌ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణ రెడ్డి, మను చౌదరి, టీజీ ఎస్పీడీసీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్, సమాచార శాఖ అదనపు సంచాలకుడు డి.ఎస్‌.జగన్‌, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *