కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఉదారత

– టెన్ల్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించేందుకు నిర్ణయం

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: విద్యార్థుల చదువు, వారికి కనీస సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న వారిపై ఫైనల్‌ పరీక్ష ఫీజు భారం పడకుండా తానే ఆ ఫీజును చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందనకు లేఖ రాశారు. ‘ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనేది నా అభిమతం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి పిల్లలకు నా వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నాను. అందుకే, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరి ఫీజు మొత్తాన్ని తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డుకు నా జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించాను. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, మెకనైజ్‌డ్‌ టాయిలెట్‌ క్లీనింగ్‌ మెషీన్స్‌ అందజేస్తున్నారు. దీంతోపాటు డబుల్‌ డెస్క్‌ బెంచీలను కూడా సమయానుగుణంగా అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నోట్‌ బుక్స్‌ పంపిణీ చేస్తున్నారు. పలు పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌కు కూడా కేంద్ర మంత్రి సహకారం అందించిన సంగతి తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page