ఏడాది చివరికి ఎయిమ్స్ పూర్తి

– జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభం
– రోగులు, వారి సహాయకుల కోసం ‘అమృత్ నివాసం’
– పనుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఈ ఏడాది చివరి నాటికి బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 202 ఎకరాల విస్తీర్ణంలో 750 పడకల సామర్థ్యంతో, అన్ని రకాల ఆధునిక వసతులతో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. మొత్తం రూ.1,110 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఈ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణ పనులు మంగళవారం ఆయన పరిశీలించి సమీక్ష అనంతáరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని, దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిమ్స్‌లు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రమే బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుండటం ప్రత్యేకతని పేర్కొన్నారు. మెడికల్ విద్యార్థుల కోసం 24 అంతస్తులతో హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వెయ్యికిపైగా సిబ్బంది నియామకం జరిగిందని, జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఎమర్జెన్సీ బ్లాక్‌లో ప్రస్తుతం 220 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

అందుబాటులోకి రిసెర్చ్ కార్యకలాపాలు 

ఎయిమ్స్‌లో వైద్య పరిశోధన (రిసెర్చ్) కార్యకలాపాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 880 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారని, అందులో 497 మంది ఎంబీబీఎస్, 146మంది స్పెషలిస్ట్ కోర్సులు, 142మంది నర్సింగ్ కోర్సులు చదువుతున్నారని వివరించారు. రోగులతోపాటు వారి సహాయకుల కోసం ‘అమృత్ నివాసం’ పేరుతో ప్రత్యేక నివాస వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్‌లో నిత్యం సుమారు 1,800మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులతో సమీక్ష నిర్వహించామని, నిర్మాణం జరుగుతున్నప్పటికీ వైద్య సేవలు నిలిచిపోకుండా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఎస్‌సీ, ఎంఎస్‌సీ నర్సింగ్ కోర్సులు కొనసాగుతున్నాయని, విద్యార్థులు యూజీ, పీజీ హాస్టల్స్‌లో నివసిస్తూ వైద్య విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు రూ.831 కోట్లు ఖర్చు చేశామని, 86 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆయుష్మాన్ భవ, ఆరోగ్యశ్రీ పథకాల కింద పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని, మిగతా వారికి కూడా నామమాత్రపు ఫీజులు ఉంటాయని చెప్పారు. ఎయిమ్స్ సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే రూ.450 కోట్లతో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్ట్టు రాబోతోందని, అది పూర్తయితే ఎయిమ్స్ సమీపంలో స్టాప్ కూడా ఏర్పాటవుతుందని వెల్లడించారు. ఎయిమ్స్‌కు సంబంధించిన స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *