‘జయజయహే..’ మైలురాయిగా నిలుస్తుంది

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
– అందెశ్రీ మృతికి తీవ్ర సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. మరీ ముఖ్యంగా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పాట తెలంగాణ ఉద్యమానికి ఓ మైలురాయిగా నిలిచిపోతుందంటూ ఆయన మృతి తీవ్ర విచారకరమన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో, తదనంతరం తెలంగాణ జాతిని జాగృతం చేసే విషయంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తెలంగాణ సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని రాజీ పడకుండా విస్పష్టంగా చెప్పారన్నారు. తన రచనలతో తెలంగాణ సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. జీవితాంతం తెలంగాణ కోసమే పనిచేసిన సౌమ్యుడు.. మంచి మనిషి అని కొనియాడారు. ఆయనతో తన అనుభవాలను నెమరువేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పోరు యాత్రలో తనతో కలిసి అనేక సభల్లో పాల్గొన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై పరిశోధన చేసి పుస్తకం రాయాలనే సంకల్పంతో అనేక పరిశోధనలు చేశారని, దురదృష్టవశాత్తు ఆ పుస్తకం పూర్తి కాకుండానే వారు మనకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు తమ ఇంటికి వచ్చినపుడు సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించుకునేవాళ్లమని, అలాగే ఆయన తనకు సలహాలు కూడా ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. చాలా పేదరికం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గ్రామీణ ప్రాంత సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలని, ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఆలోచించేవారన్నారు. అందెశ్రీ స్వర్గస్తులవడాన్ని తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఆయన రాసిన అనేక పాటలు ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతాయన్నారు. మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు, జయ జయహే తెలంగాణ వంటి అద్భుతమైన పాటలను తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాదిమందిలో స్ఫూర్తిని రగిలించాయని గుర్తు చేశారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, లాలాపేటలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఉంచిన డాక్టర్‌ అందెశ్రీ పార్థివ దేహంపై కిషన్‌రెడ్డి పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం అందెశ్రీ సతీమణి, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *