– రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
– ఐదు పాఠశాలలకు టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో మొత్తం 21 పాఠశాలలకు నూతన భవనాలను నిర్మించానని, ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నూతన భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. నగరంలో అనేక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నందున వాటిని పునర్నిర్మించాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన ముఖ్యంగా టాయిలెట్స్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈమేరకు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాణిగంజ్‌లో జీహెచ్ఎస్ ఆదయ్య మెమోరియల్ పాఠశాల, కలాసిగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పార్క్ లేన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, న్యూ నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాష్ట్రపతి రోడ్డులోని ఆర్య సమాజ్‌పాఠశాలలో ఆయన టాయిలెట్స్ క్లీనింగ్ మిషన్స్‌ను శనివారం పంపిణీ చేశారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడంతో పిల్లల డ్రాపౌట్స్ జరుగుతున్నాయని, మరికొన్నింటిలో టాయిలెట్స్ ఉన్నా పారిశుధ్య నిర్వహణ సరిగా లేక పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణలో రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ శానిటేషన్ సిబ్బందిని నియమించాల్సిన అవసరం కనిపిస్తున్నదని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు విద్యా రంగానికి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజంలో మనకంటూ ఓ గుర్తింపును, మన పట్ల సమాజంలో సానుకూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు విద్య దోహదపడుతుందని కిషన్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





