– వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే
– ముస్లిం రిజర్వేషన్లు కలిపి బీసీలను ఆగం చేస్తున్నారు
– ఇదేనా మీ తెలంగాణ మోడల్
– రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: తమ ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ(BJP), మోదీ(Modi)పైన కాంగ్రెస్ పాలకులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్‌తోపాటు రాహుల్ గాంధీ(Rahul), సోనియాగాంధీ (Sonia) పూర్తి బాధ్యత వహించాలన్నారు. మైనారిటీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పేర్లతో ఆయా వర్గాలను మోసం చేశారని, అధికారంలోకి వచ్చాక దేన్నీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఈ 18 నెలల్లో దిల్లీ ప్రదక్షిణలు తప్ప తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన అన్నారు. బీసీలకు సామాజిక సాధికారత కల్పించే ప్రయత్నంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని తెలంగాణ సమాజం అర్థం చేసుకుందన్నారు. మోదీని గద్దె దించేందుకు రేవంత్ రెడ్డి శిలాశాసనం రాస్తున్నారని, మీరు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో గెలిచినా రాహుల్ గాంధీ ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారన్నారు.
న్యాయబద్ధంగా చర్చించి రిజర్వేషన్ ఇవ్వాలి
బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో న్యాయబద్ధంగా చర్చించి ఇచ్చే ప్రయత్నం చేయాల్సి ఉండగా రేవంత్ రెడ్డి రాజకీయంగా పోరాడుతున్నారన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చి హోల్‌సేల్‌గా అవినీతి చేస్తే కాంగ్రెస్ పార్టీ రిటైల్‌గా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో తెలంగాణలో స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు కాగా దాన్ని కేసీఆర్ 27 శాతానికి తగ్గించారని, మజ్లిస్ కనుసన్నల్లో 12శాతం బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా 34శాతం ఉన్న రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. సర్వేలోనూ అనేక తప్పులు చేశారని, బీసీల సంఖ్యను తగ్గించారని, అందులో 10 శాతం ముస్లింలను చేర్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను పెట్టి దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారా.. ఇదేనా మీ తెలంగాణ మోడల్.. బీసీ సామాజిక వర్గానికి మోసం చేయడమే తెలంగాణ మోడలా అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా, బీఆర్‌ఎస్ అయినా మజ్లిస్ చెప్పినట్లే పాలిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలో 25శాతం మంది ఇళ్లలోకి వెళ్లకుండా జనగణన సర్వే చేశామని, దాన్ని గొప్ప సర్వేగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారంటున్నారు.. అలాంటపుడు మళ్లీ రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉండదు.. చట్టపరమైన, న్యాయపరమైన అంశాలపై అనుమానాలుంటేనే రాష్ట్రపతి సూచన కోసం పంపిస్తారు.. అది గవర్నర్‌ను అడిగి తెలుసుకోండి అని ఆయన హితవు పలికారు. రాష్ట్రపతిగా ఉన్న మహిళపై తెలంగాణలోని ఓ మహిళా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సోనియా గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.
రేవంత్‌రెడ్డివి పెద్ద మాటలు
మోదీని గద్దె దించుతా.. రాహుల్‌ను ప్రధానిని చేస్తానని రేవంత్‌రెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడం ఖాయం. ముఖ్యమంత్రిగా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు సేవ చేయాలే తప్ప స్థాయికి మించి మాటలు మాట్లాడొద్దని సూచిస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రజల ఆశీస్సులతో బీజేపీ ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. రాజకీయంగా ఉన్న సమస్యలు సామరస్యంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నామంటూ వివాదాలతో ప్రజల్లో ఆందోళన కల్పించే కుట్రలను అడ్డుకుంటామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.





