దిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై కిషన్‌రెడ్డి
దిల్లీ, ఆగస్టు 6: రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి దిల్లీ ధర్నా పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50శాతానికంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చినందున దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని అన్నారు. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప బట్టకాల్చి బీజేపీ మీద వేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. చట్టపరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 18 నెలలుగా అందులో పేర్కొన్న అంశాల అమలు ఊసెత్తడం లేదున్నారు. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని చెప్పారని, ఆ ప్రకారం ఇప్పటికే కనీసం రూ.40వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి.్స ఉండగా ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, రజకులు, గౌడ్లు.. ఇలా ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్టనిలువునా మోసం చేశారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప బీసీలకు సాధికారత కల్పించే విషయంలో మీకు చిత్తశుద్ధి లేదనేది తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైందన్నారు. పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, ఆర్థికపరంగా వైఫల్యం ఇలా వరుసగా మీ చేతకాని తనం బయటపడుతుండటంతోనే దిల్లీలో ధర్నా చేసి వాటినుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల్ సీట్లలో ముస్లింలు పోటీ చేసి 50 రిజర్వ్‌డ్ సీట్లలో 31 చోట్ల గెలిచారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా మజ్లిస్ పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారని, ఇప్పుడు అధికారికంగా 10శాతం ముస్లింలను బీసీల్లో చేర్చి 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు రాజ్యాధికారం కష్టమేననేది తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు. ముందుగా అశాస్త్రీయమైన సర్వే చేసి బీసీల సంఖ్యను తగ్గించారు.. ఆ తర్వాత దీనికి పది శాతం ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. నాడు బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే నేడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టే మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుని తీరుతుందన్నారు. నరేంద్రమోదీ గారిని రేవంత్ రెడ్డి విమర్శిస్తే అది ఆకాశం మీద ఉమ్మేయడమే అవుతుందన్నారు. మోదీ గారి నేతృత్వంలో సుస్థిరమైన పాలన అందుతోందని, అందుకే కనీసం వచ్చే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ కేంద్రంలో అధికారం గురించి ఆలోచించడం మానుకోవడమే ఉత్తమమని కిషన్‌రెడ్డి హితవు చెప్పారు.





