కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సమస్యకు త్వరలోనే పరిష్కారం కానున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధానిగా పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. రైలు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ)కి ప్రధాని మోదీ భూమి పూజ చేశారని, ఈయూనిట్ 60 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ యూనిట్ పనుల పురోగతిని శనివారం పరిశీలిస్తారని చెప్పారు. రైలు ఇంజన్, కోచ్, వ్యాగన్స్ ఉత్పత్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ముందుగా రైలు ఇంజన్ తయారు చేయాలని నిర్ణయించామన్నారు. రాదు అనుకున్న పరిశ్రమను మోదీ తెలంగాణకు ఇచ్చారని, వరంగల్‌కు మెగా టెక్స్‌టైల్ పార్క్ తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి చెప్పారు. రైలు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రూ.200 కోట్లతో ప్రారంభమైందని, మరో రూ.200 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వరంగల్‌లో ఆధునికమైన కోచ్‌లు తయారు చేసే అవకాశం ఉందని, సుమారు మూడు వేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందని చెప్పారు. ఇక్కడ నివసించే రాజస్థాన్ ప్రజలు రైలు కావాలని కోరుతున్నారని, రేపు రాజస్థాన్‌కు ట్రైన్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, కానీ ఆ ఒప్పందానికి కట్టుబడి లేదని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పాలకులు మాత్రం హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వరంగల్ విమానాశ్రయానికి భూమి సేకరించి ఇవ్వాలని కేసీఆర్‌కు అనేక లేఖలు రాశామని, కేసీఆర్ రాళ్లు వేయడం, విమర్శించడం తప్ప భూమి సేకరించి ఇవ్వలేదని విమర్శించారు.





