కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

– మహేశ్వరం మెడికల్ కాలేజీ రద్దు తగదు
– ఫార్మా సిటీ భూములపై పోరాటం
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ఆడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారÁని మాజీ మంత్రి, బీఆరఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. కందుకూరు మండలం సార్లరావులపల్లిలో గురువారం జరిగిన శ్రీ స్వయంభు పెద్దమ్మతల్లి జాతర, రాజశ్యామల హోమం వేడుకల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీజేపీ అధికారంలోకి రాగానే ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి రాష్ట్ర గొంతు కోసిందని విమర్శించారు. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు కాకుండా చేసింది బీజేపీనేనన్నారు. విభజన చట్టంలో లేని అంశాలను కూడా తెలంగాణకు వ్యతిరేకంగా అమలు చేస్తూ ఇప్పుడు పార్లమెంsటులో కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినందుకు ఆయన తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహేశ్వరం మెడికల్ కాలేజీ రద్దుపై ఆగ్రహం

మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ మంజూరు చేసిన మెడికల్ కాలేజీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. రూ. 150 కోట్లు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తయిన కాలేజీని రద్దు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు. తక్షణమే ఇక్కడ 250 పడకల హాస్పిటల్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఫార్మా సిటీ భూములపై న్యాయ పోరాటం

ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ నాయకులు తమ అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఫార్మాసిటీ వద్దనుకుంటే ఆ భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలన్నారు. అంతేగానీ రైతుల భూములతో అడ్డగోలు వ్యాపారం చేస్తే బీఆరఎస్ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తాం అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *