– అత్యాధునిక పద్ధతిలో కిడ్నీలోని 1820 రాళ్ల తొలగింపు
– డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : వైద్య రంగంలో మరో అద్భుత విజయాన్ని హనుమకొండకు చెందిన శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ సాధించింది. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒకే కిడ్నీ నుండి 1820 రాళ్లను వైద్యులు తొలగించారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సను ప్రసిద్ధ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి చేపట్టి విజయవంతం చేశారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన దినసరి కూలీ కడకంచి పరశురాములు ఈనెల 23న తీవ్రమైన కిడ్నీ నొప్పితో హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌లో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కిడ్నీలో ‘డూప్లెక్స్ మొయిటీ’ అనే అరుదైన స్థితి ఉందని, అంటే ఒకే కిడ్నీలో ద్వంద్వ మూత్రపిండ నిర్మాణం ఉండటం వల్ల కిడ్నీలో అత్యధిక సంఖ్యలో అక్షరాలా 1820 రాళ్లు ఉన్నట్టు గుర్తించామని డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు వారు అత్యాధునిక మల్టీ ట్రాక్ పిసిఎన్‌ఎల్ పద్ధతిని అనుసరించామని, ఒకే సిట్టింగ్‌లో మొత్తం రాళ్లను తొలగించగలిగినట్లు వివరించారు. రోగి హాస్పిటల్‌కు వచ్చే ముందు హనుమకొండ, హైదరాబాద్ వంటి నగరాల్లోని అనేక ప్రసిద్ధ హాస్పిటల్స్‌ను సంప్రదించారని, అక్కడి వైద్యులు ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదిగా పేర్కొని, రెండు నుంచి మూడు విడతల్లో శస్త్ర చికిత్స అవసరమవుతుందని సూచించారని తెలిపారు. అంతేకాక అందులో కూడా మొత్తం రాళ్లను పూర్తిగా తొలగించలేమని స్పష్టం చేయడంతోపాటు ఆపరేషన్ ఖర్చు రూ.3.5 లక్షలకు పైగా అయ్యే అవకాశముందని రోగికి తెలిపారన్నారు. ఈ సమాచారం రోగిని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, ఆర్థికంగా కూడా అసాధ్యంగా అనిపించిందని డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆ తరవాత రోగి శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌ను సంప్రదించగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించామని చెప్పారు. అత్యంత నైపుణ్యంతో ఏ ఒక్క రాయి మిగలకుండా కిడ్నీలోని 1820 రాళ్లను తొలగించడం ద్వారా రోగికి నూతన జీవితం ఇచ్చినట్లయిందన్నారు. శస్త్ర చికిత్స అనంతరం 72 గంటల వ్యవధిలోనే రోగిని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశామని, ప్రస్తుతం ఆయన సంపూర్ణంగా కోలుకున్నారని వెల్లడిరచారు. రోగి పరశురాములుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అరుదైన ఆపరేషన్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి వైద్య నైపుణ్యాన్ని మాత్రమే కాదు ఆయన సేవా దృక్పథాన్ని కూడా చాటిచెబుతున్నది. అత్యాధునిక సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఈ విజయంతో మరో మెట్టు ఎదిగారు. కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ విజయ గాథ ఒక ఆశాజ్యోతిగా నిలుస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





