చిన్న పిల్లల కిడ్నాప‌ర్లు ఇద్ద‌రి అరెస్ట్‌

– ఐదుగురు పిల్లల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
– పోలీసుల అదుపులో పిల్లల్ని కొనుగోలుచేసిన వ్యక్తులు

వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 10: చిన్న పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నిందితులను కాజీపేట్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఘనాపూర్‌ గ్రామానికి చెందిన కొడుపాక నరేష్‌, పెద్దపల్లి టౌన్‌ శాంతినగర్‌కు చెందిన వేల్పుల యాదగిరిలను అరెస్టు చేసినట్లు వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ విలేకరులకు వివరించారు. డిసెంబర్‌ 28న తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్‌ బయట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నా నాయక్‌ కుమారుడు మల్లన్న(5 నెలలు)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. కన్నా నాయక్‌ ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేయగా విచారించగా నేరస్థలంలో లభించిన ఆధారాలతో నిందితులిద్దరు శనివారం ఉదయం అద్దెకు తీసుకున్న కారులో వచ్చి పిల్లల్ని కిడ్నాప్‌ చేసేందుకు కాజీపేట రైల్వే స్టేషన్‌ బయట ఫుట్‌పాత్‌ వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఇద్దరిని కాజీపేట పోలీసులు పట్టుకుని విచారించగా డిసెంబర్‌ 28న ఐదు నెలల బాబుతోపాటు గతంలో నలుగురు పిల్లల్ని కిడ్నాప్‌ చేసినట్లు ఒప్పుకున్నారు. అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టు నమ్మబలికి పిల్లలు లేని దంపతులకు అమ్ముకున్నారు.

ఎక్క‌డెక్క‌డ అమ్మారంటే..

డిసెంబర్‌లో కిడ్నాప్‌ చేసిన ఐదు నెలల బాబుని జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామంలో, గత ఆగస్టులో వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న పది నెలల పాపను మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో, 2023 అక్టోబర్‌లో కాజీపేట రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడేళ్ల బాబును జన్నారం మండలంలో అమ్మారు. అక్టోబర్‌లో మంచిర్యాల రైల్వే స్టేషన్‌ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 5 నెలల పాపను మంచిర్యాలలో, జూన్‌లో రామగుండం రైల్వే స్టేషన్‌ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న పది నెలల పాపను జగిత్యాల జిల్లాలో విక్రయించారు. ఈ ఐదుగురు పిల్లలను స్వాధీనం చేసుకోవడంతోపాటు పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. కిడ్నాపర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్సు, కాజీపేట పోలీస్‌ అధికారులు, సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత, టాస్క్‌ఫోర్స్‌, కాజీపేట ఏసీపీలు మధుసూదన్‌, ప్రశాంత్‌రెడ్డి, కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సిబ్బందితోపాటు, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *