రాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

– అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సభ్యులు
– గందరగోళం మధ్య తొలుత వాయిదా
– అమిత్‌ షా కనుసన్నల్లో సభ నడుస్తోందన్న విపక్ష నేత ఖర్గే

న్యూదిల్లీ, ఆగస్టు 5: రాజ్యసభ జరుగుతున్న తీరుపై విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా కనుసన్నల్లో సభను నడుపుతున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తుండడం, ప్రతిపక్షాల గొంతులను అణచివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు చైైర్మన్‌ స్థానంలో ఉన్నవారు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగడం కూడా సమావేశాల్లో భాగమే అని భావించేవారన్నారు. కానీ ప్రస్తుతం సభల్లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తమ ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారంటూ మండిపడ్డారు. హోంమంత్రి సూచనల ప్రకారం సభలో నడుచుకుంటున్నారని, అసలు సభను నడిపిస్తున్నది మీరా లేక అమిత్‌ షానా అని డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ను ఖర్గే ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలపై హరివంశ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మరోవైపు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని సభలోకి తీసుకొచ్చారని, వారు ప్రతిపక్ష నేతలను తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకోకుండా నిరోధిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. వారి వాదనను హరివంశ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తోసిపుచ్చారు. ప్రతిపక్ష నేతలు సభను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిరది. రాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని తాను చాలాసార్లు చెప్పినప్పటికీ వారు తమ తీరు మార్చుకోవట్లేదని మండిపడ్డారు. తాను దాదాపు 40 ఏళ్లకుపైగా ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రతిపక్ష స్థానాల్లో ఉన్న నేతలు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలంటే తన దగ్గర ట్యూషన్‌ చెప్పించుకోవాలని విపక్ష నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎందుకంటే వారు ఆ స్థానంలో కేవలం పదేళ్లు మాత్రమే ఉన్నారని మరో 40 ఏళ్లు అక్కడే ఉండాలి కాబట్టి ఇటువంటి విషయాలు నేర్చుకోవాలని చురకలు అంటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *