– ఉగ్రవాదులను ఏరివేసామని అబద్దాలు ప్రచారం చేస్తారా
– అబద్దాల కార్ఖానాలు ఏర్పాటు చేసిన బిజెపి
– సిందూర్‌పై చర్చలో విపక్ష నేత ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
– నడ్డా అభ్యంతరం.. విపక్షం డిమాండ్‌తో క్షమాపణలు
న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్ సిందూర్ పై రాజసభ్యలోనూ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై సభాపక్ష నేత జేపీ నడ్డా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దీంతో అధికార, విపక్ష సభ్యుల చప్పుళ్లతో సభ కొద్దిసేపు దద్దరిల్లింది. చివరకు తన వ్యాఖ్యలను నడ్డా వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పడంతో సభ సద్దుమణిగింది.పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దాదాపు గంటపాటు ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖర్గే ప్రసంగం ముగిసిన వెంటనే స్పందించిన నడ్డా కాంగ్రెస్ అధ్యక్షుడు ’మానసిక సమతుల్యత’ కోల్పోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో నడ్డా చర్యలను తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు క్షమాపణ చెప్పాలంటూ బల్లలు చరుస్తూ ఆందోళన చేపట్టాయి. అనంతరం ఖర్గే కూడా మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వంలో తాను గౌరవించే మంత్రుల్లో నడ్డా కూడా ఒకరని, అయినప్పటికీ తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. మంత్రి నడ్డా స్పందిస్తూ ఇప్పటికే తన మాటలు వెనక్కి తీసుకున్నానని, క్షమాపణ కూడా చెప్పానని అన్నారు. మోదీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు. అందుకు భాజపానే కాదు దేశం మొత్తం గర్విస్తోందని కేంద్ర మంత్రి నడ్డా పేర్కొన్నారు. ఖర్గే మాత్రం ఆయన స్థాయిని పట్టించుకోకుండా అభ్యంతరకరంగా మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ తన పరిధిని దాటి ప్రధానిపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని నడ్డా పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై ఉభయసభల్లో చర్చ జరుగుతుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలో లేకపోవడాన్ని ఖర్గే తప్పుపట్టారు. తామంతా అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటే ఆయన బీహార్‌లో రాజకీయ ర్యాలీలో పాల్గొన్నారని అన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం అవసరమా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయ్యాయని తెలిపారు. తమరు ప్రభుత్వ రంగ కార్ఖానాలు కాదు.. అబద్ధపు కార్ఖానాలు ఏర్పాటు చేశారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిందని తెలియజేశారు. పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని అడిగితే మోదీ స్పందించలేదని, ఘటన జరిగిన 3 నెలల తర్వాత పార్లమెంటులో చర్చ పెట్టారని మండిపడ్డారు. పార్లమెంటుకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే దేశభక్తి అవుతుందా అని ప్రశ్నించారు. విపక్షాలు పాకిస్థాన్ కు మద్దతు ఇస్తున్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అసత్యాలతో ఎక్కువకాలం ప్రజలను మభ్య పెట్టలేరని అన్నారు. తాము ఎప్పుడూ పాకిస్థాన్ కు మద్దతు ఇవ్వలేదని, ఇవ్వబోము అని చెప్పారు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ.. కాంగ్రెస్ కు చాలా చరిత్ర ఉందని కొనియాడారు. పహల్గాం ఘటనతో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారని, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాద సమస్య బిజెపి హయాంలో మూడింతలు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాల మూలాలు దెబ్బతీస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో చెప్పారని అన్నారు. పాక్ ఉగ్రవాదులు పహల్గాం వరకు ఎలా వచ్చారని, పహల్గాం దాడికి 3 రోజుల ముందు ప్రధాని జమ్మూ పర్యటన రద్దు చేసుకున్నారని ఎద్దేవ చేశారు. ప్రధాని పర్యటన రద్దు చేసుకుంటారని.. పర్యాటకులను ఎలా అనుమతించారని నిలదీశారు. పహల్గాం దాడి కచ్చితంగా భద్రతా వైఫల్యమని జమ్మూకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ అన్నారని ఖర్గే పేర్కొన్నారు. అన్నీ తన ఘనతగా చెప్పుకునే జవాబుదారీ మోదీ పహల్గాం ఘటనకు ఎందుకు బాధ్యత వహించరని ప్రశ్నించారు. సైనికుల విజయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని, ఆపరేషన్ సిందూర్ లో భారత విజయంపై కాంగ్రెస్ కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.





