– తెల్లవారుజాము నుంచి షెడ్డు తొలగింపు ప్రక్రియ
– శనివారం మధ్యాహ్నం నిమజ్జనం
– నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు
– బందోబస్తులో 30 వేల మంది పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఖైరతాబాద్ గణేశుడిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయనున్నందున గురువారం రాత్రి 12 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పందిరి తొలగింపు పనులు ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి 12 గంటల తర్వాత విగ్రహాన్ని ట్రాలీ పైకి చేర్చి వెల్డింగ్ పనులు చేస్తారని, శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తామని, మధ్యాహ్నం 1.30 గంటల లోపు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు. శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ప్రభుత్వ శాఖల అధికారులతో సీపీలు సమీక్ష జరిపారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ ఈసారి వినాయక నిమజ్జనోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారని తెలిపారు.
జీహెచ్‌ఎంసీ, పోలీసుల విస్తృత ఏర్పాట్లు
వినాయక నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 40 క్రేన్లు సిద్ధంగా ఉంచగా లైటింగ్, మొబైల్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. నగరవ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల వద్ద మాత్రమే విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఐదు అడుగుల లోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని సూచించారు. నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 30 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారన్నారు. ఈనెల 2వరకు గ్రేటర్ పరిధిలో 1,21,905 విగ్రహాల నిమజ్జనం జరిగిందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అత్యధికంగా కూకట్‌పల్లి జోన్‌లో 41 వేలకుపైగా, శేరిలింగంపల్లిలో 21 వేలకుపైగా విగ్రహాల నిమజ్జనం జరిగిందని, అత్యల్పంగా చార్మినార్‌లో 6,254 విగ్రహాలు గంగ ఒడికి చేరాయని పేర్కొంది.
నిమజ్జనానికి ఆర్‌టీఏ వాహనాలు
మహా నిమజ్జనం నేపథ్యంలో రవాణా శాఖ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సిఫారసు మేరకు స్థానిక రవాణా శాఖ కార్యాలయాల్లో నిర్వాహకులకు వాహనాలు సమకూరుస్తారు. నేరుగా ఆర్‌టీఏ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా అందుబాటులో ఉన్న వాహనాలను పంపుతామని ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకు 1500కుపైగా అభ్యర్థనలు వచ్చాయన్నారు. ట్రయిలర్/టస్కర్ల అద్దె రూ.33 వేలు కాగా హెచ్‌జీవీ, ఎంజీవీ, ఎల్‌జీవీ వాహనాలకు రూ.1000 నుంచి రూ.4500గా నిర్ణయించారు. ఇంధనం, డ్రైవర్, క్లీనర్ల బత్తా అదనం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





