ఉత్సవాలంటే ఖైరతాబాద్‌ గణపతే గుర్తుకొస్తారు

– గణపయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఖైరతాబాద్‌ మహా గణపతి శనివారం గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆయనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఖైరతాబాద్‌ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకున్నాయని, దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలంటే ఖైరతాబాద్‌ గణపతి అని చర్చించుకునేలా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందిస్తున్నానని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వలేదు కానీ మన రాష్ట్రంలో గణపతి మండపాలకు ఉచిత విద్యుత్‌ అందించి భక్తితో ఉత్సవాలు నిర్వహించుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ అధికారులను సమన్వయం చేస్తూ పరిష్కరించుకుంటూ ఉత్సవాలకు ఆటంకం కలగకుండా చూశామని, అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని చెప్పారు. నిమజ్జనాలకు ఇబ్బంది కలగకుండా ట్యాంక్‌ బండ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశామంటూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కష్టనష్టాలకోర్చి ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ కమిటీలోని ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం అన్నారు. ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాలు తెలంగాణకి మంచి పేరు తెచ్చి పెట్టాయి అని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *